
- ఎమ్మెల్యే గువ్వల డబ్బులు తరలిస్తున్నారని వెంబడించిన కాంగ్రెస్ శ్రేణులు
- వాహనాలను అడ్డుకున్న కార్యకర్తలు
- పోలీసుల లాఠీచార్జి
అచ్చంపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో హైడ్రామా నడిచింది. శనివారం రాత్రి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్ కు చెందిన వాహనాల్లో ఓటర్లకు పంచేందుకు పెద్దమొత్తంలో డబ్బులు తరలిస్తున్నాడనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉప్పునుంతల మండలం వెల్టూర్గేట్ నుంచి వెహికల్స్‌ను ఫాలో అయ్యారు. అదే సమ యంలో అచ్చంపేటలోని కాంగ్రెస్ శ్రేణులను అలర్ట్ చేశారు.
వెహికల్స్అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు దాడులు చేసుకున్నారు. పోలీసులు తమ లీడర్లపైనే దాడులు చేశారని, బీఆర్ఎస్ తరలిస్తున్న డబ్బుల బ్యాగులను తప్పించేలా సహకరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాలు మరోసారి దాడులు చేసుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు లాఠీచార్జ్చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు.
సినిమా చూపిస్తామన్న సీఐ అనుదీప్
కాంగ్రెస్ లీడర్లు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ అనుదీప్, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. బైఠాయించిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, ఇతర లీడర్లు, కార్యకర్తలతో ఒకింత బెదిరింపు స్వరంతో మాట్లాడారు. ‘మీరు అనుకుంటున్నారేమో సినిమా అంతా ఉంది.. దాడులు చేసి ధర్నాలకు దిగుతారా? ప్రజలంతా గమనిస్తున్నారు. వాహనాలను ఎవరు అడ్డుకున్నారో.. ఎవరు ఏం చేశారో అంతా ఉంది..మీకు సినిమా చూపిస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వీడియోను కాంగ్రెస్ లీడర్లు సోషల్‌మీడియాలో వైరల్ చేశారు.
హైదరాబాద్ హాస్పిటల్‌కు ఎమ్మెల్యే..!
కాంగ్రెస్ దాడిలో ఎమ్మెల్యే బాలరాజు స్వల్పంగా గాయపడ్డాడని, ఇంటికి చేరుకున్న తర్వాత స్పృహ కోల్పోయాడని చెబుతూ ఆయన అనుచరులు అచ్చంపేట హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. కాంగ్రెస్ లీడర్లు రౌడీయిజం చేస్తూ బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగారని ఆరోపిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు అచ్చంపేట హాస్పిటల్ ముందు శ్రీశైలం, నాగర్ కర్నూల్ మెయిన్‌రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేపై దాడి చేసిన వంశీకృష్ణ, అతని అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
అడ్డంగా దొరికిపోయి డ్రామాలాడుతున్నరు
ఎమ్మెల్యే గువ్వల ఓటర్లకు పంచేందుకు డబ్బులు తరలిస్తూ అడ్డంగా దొరికిపోయి డ్రామాలాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలపై దాడులకు దిగడం అప్రజాస్వామికమన్నారు. డబ్బుల బ్యాగులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులపై ఎమ్మెల్యే దాడులకు దిగారని, వారికి అచ్చంపేట పోలీసులు వత్తాసు పలికారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లపై దాడులకు దిగిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అచ్చంపేట సీఐతోపాటు మరి కొంత మంది ఎస్ఐలపై కూడా ఈసీకి కంప్లయింట్చేస్తామన్నారు. కాగా, ఈ ఘటనపై అచ్చంపేట పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.