ఫర్హతుల్లాతో కలిసి విధ్వంసానికి జాహెద్ ప్లాన్

ఫర్హతుల్లాతో కలిసి విధ్వంసానికి జాహెద్ ప్లాన్
  • నాంపల్లి కోర్టుకు రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో పోలీసుల వెల్లడి
  • ఎన్‌‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌‌ అప్లికేషన్‌‌ లో చాటింగ్ 

హైదరాబాద్, వెలుగు: దసరా రోజున భారీ విధ్వంసానికి కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అబ్దుల్ జాహెద్, సమీయుద్దీన్‌‌, మాజా హసన్‌‌ ల రిమాండ్ రిపోర్టులో టెర్రరిస్టుల కుట్రను పోలీసులు వెల్లడించారు. పేలుళ్లకు ప్లాన్ చేసిన విధానం గురించి నాంపల్లి కోర్టుకు పోలీసులు రిమాండ్‌‌ రిపోర్ట్‌‌ను అందజేశారు. పాకిస్తాన్ కేంద్రంగా ఫర్హతుల్లా ఘోరీ సృష్టించిన మారణహోమాలను ఆ రిపోర్టులో వెల్లడించారు. జాహెద్‌‌ సోదురులు కూడా టెర్రర్ యాక్టివిటీస్‌‌లో పాల్గొన్నారని, ఈ క్రమంలోనే జాహెద్‌‌ కూడా టెర్రరిజం వైపు వెళ్లాడని కోర్టుకు తెలిపారు. హవాలా డబ్బును టెర్రర్ ఫండింగ్‌‌గా రూ.33 లక్షలు జాహెద్ కు అందాయని పేర్కొన్నారు. ‘‘F’’ పేరుతో ఎన్‌‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌‌ అప్లికేషన్‌‌లను జాహెద్‌‌ క్రియేట్ చేశాడని వెల్లడించారు. పాక్  నుంచి ఫర్హతుల్లా చేసే ఆదేశాలతో జాహెద్‌‌ పనిచేసేవాడు. ఇందులో భాగంగా ఈ నెలలో కొన్ని రోజుల వ్యవధిలో మారణహోమానికి వారు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. అందు కోసం గత నెల 27న ఫర్హతుల్లా ఘోరీతో ఎన్‌‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌‌ ద్వారా చాట్ చేశారు. వాట్సాప్ ద్వారా హ్యాండ్ గ్రెనేడ్ ఫొటోలను గుర్తించారు. గత నెల 28న మహారాష్ట్ర మనోహరాబాద్‌‌కు బైక్ పై వెళ్లి నాలుగు గ్రెనేడ్లను తీసుకువచ్చారు. 3 గ్రెనేడ్‌‌లను జాహెద్‌‌ ఉంచుకోగా, ఓ గ్రెనేడ్‌‌ మాజా హసన్ ఉంచుకున్నాడు. దసరా కావడంతో రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేశారు. 

గ్రెనేడ్లు ఎక్కడ వేయాలో ముందుగానే రెక్కీ
వరుస పండగల నేపథ్యంలో మతపరమైన ఘర్షణలు సృష్టించేందుకు టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. గ్రెనేడ్లను ఎక్కడ వేయాలి, ఎలాంటి విధ్వంసం సృష్టించాలో ఫర్హతుల్లా ఘోరీ ఆదేశించాడని తెలిపారు. వారి వాట్సాప్ చాటింగ్స్, ఎఫ్‌‌ పేరుతో ఉన్న అప్లికేషన్ల వివరాలు రాబడుతున్నామని తెలిపారు. ఎన్‌‌క్రిప్టెడ్ కోడ్ ద్వారా చాటింగ్స్ చేశారని, వాటిని పరిశీలించేందుకు టెక్నికల్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ను సంప్రదిస్తున్నామని చెప్పారు.