అవమానంతో రైలులో యువతి సూసైడ్

అవమానంతో రైలులో యువతి సూసైడ్

గుజరాత్‌లోని వల్సాద్‌లో ఓ 19 ఏళ్ల యువతి రైల్ కోచ్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నవంబర్ 4న జరిగిన ఈ ఘటన కొత్త కోణంలోకి వెళ్తుంది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతిపై సామూహిక అత్యాచారం జరగడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా యువతి డైరీ దొరకడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డైరీ ప్రకారం.. వడోదరలోని ఓ హాస్టల్ లో ఉండే యువతి.. పని మీద బయటకు వెళ్లి ఆటోలో వస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. కళ్లకు గంతలు కట్టి, ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఓ వ్యక్తి రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. దాంతో బాధితురాలు.. ఆ వ్యక్తి సాయంతో హాస్టల్ కు చేరుకుంది. 

అయితే ఘటన పట్ల తీవ్ర మనస్థాపానికి గురైన యువతి.. క్వీన్ ఎక్స్‌ప్రెస్ రైల్ కోచ్‎లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఈ ఘటనను గుజరాత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందా లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా విచారించాలని అధికారులను ఆదేశించామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్-సీఐడీ సుభాష్ త్రివేది తెలిపారు. అయితే బాధితురాలు నేరం గురించి స్పష్టంగా చెప్పనందున.. పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని ఓ అధికారి తెలిపారు.