
- గిరిజనుడిపై పోలీసుల ప్రతాపం
- థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు
- స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన
సూర్యాపేట, వెలుగు: ‘‘చచ్చేలా కొడ్తరా” అంటూ మరియమ్మ లాకప్ డెత్ కేసులో పోలీసులపై హైకోర్టు సీరియస్ అయిన రోజే... మరో వ్యక్తిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. దొంగతనం చేశాడన్న ఆరోపణలతో ఓ గిరిజన యువకుడిని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. థర్డ్ డిగ్రీతో చిత్రహింసలు పెట్టారు. దెబ్బలకు తాళలేక బాధితుడు స్టేషన్ లోనే కుప్పకూలాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలో బుధవారం ఈ ఘటన జరిగింది. మండల పరిధిలోని రామోజీ తండాకు చెందిన గుగులోతు వీర శేఖర్‌ను దొంగతనం చేశాడన్న ఆరోపణలతో పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని చితకబాదారు. దెబ్బలకు తాళలేక అతడు స్టేషన్ లోనే కుప్పకూలడంతో కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి రాత్రి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికెళ్లినంక శేఖర్ పరిస్థితి విషమించడంతో గురువారం గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.
అనంతరం బాధితుడిని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడ ట్రీట్ మెంట్ పొందుతున్నాడు. ‘‘దొంగతనం చేయలేదని ఎస్సై కాళ్ల మీద పడ్డా కనికరం చూపలేదు. ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. నాకు సంబంధం లేదని చెప్పినా, దొంగతనం చేసినట్లు ఒప్పుకొమ్మని సిబ్బందితో కలిసి చితకబాదాడు. ఎస్సై పై చర్యలు తీసుకోవాలి” అని వీర శేఖర్ వాపోయాడు. ‘‘రామోజీ తండాకు చెందిన వీర శేఖర్ ను అనుమానంతో అదుపులోకి తీసుకున్నాం. ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఇంటికి పంపించాం. ఎలాంటి చిత్ర హింసలు పెట్టలేదు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతాం” అని సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.