ఉగాదిలోపు పోలీస్ టవర్స్..

ఉగాదిలోపు పోలీస్ టవర్స్..
  • కేసీఆర్ ఆదేశాలతో వేగంగా కొనసాగుతున్న పనులు
  • ఉగాదిలోపు పోలీస్ టవర్స్.. జూన్​ కల్లా అమరవీరుల స్థూపం

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ నిర్మాణం దసరా కల్లా పూర్తి చేసేందుకు పనులు స్పీడ్​గా చేస్తున్నారు.  “ఇప్పటికే 5 ఫ్లోర్ల స్లాబ్ లు పూర్తయ్యాయి. ఇంకా రెండు ఫ్లోర్ల స్లాబ్ లు పూర్తి కాగానే ప్లాస్టింగ్ చేస్తం. తర్వాత ఫ్లోరింగ్, ఇంటీరియర్ పనులు చేపడ్తం. ఎట్టి పరిస్ధితుల్లోనూ దసరాకు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు” అని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సెక్రటేరియట్ పోయినేడాది దసరాకే ప్రారంభం కావాల్సి ఉండగా, లాక్ డౌన్ తో కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లడంతో పనులు ఆగిపోయాయి. అమరవీరుల స్థూపం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (పోలీస్ టవర్స్) నిర్మాణాలు కూడా త్వరలోనే పూర్తి కానున్నాయి. ఉగాది లోపు పోలీస్ టవర్స్, జూన్ కల్లా అమరవీరుల స్థూపం నిర్మాణాలు పూర్తయ్యేలా పనులు జరుగుతున్నాయి. వీటన్నింటి పనులను తొందరగా చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోయిన నెల 9న సెక్రటేరియట్​ పనులను పరిశీలించిన సీఎం.. నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దసరా కల్లా పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ కంపెనీ పనులు వేగంగా చేస్తోంది. 

రెండు నెలల్లో పోలీస్ టవర్స్.. 
బంజారాహిల్స్ లో ఆరేండ్ల కింద చేపట్టిన పోలీస్ టవర్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ.300 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టగా, ఇప్పుడది రూ.700 కోట్లకు చేరుకుంది. 7 ఎకారల్లో 20 ఫ్లోర్లలో రెండు టవర్స్, 15 ఫ్లోర్లలో మరో 2 టవర్స్ నిర్మిస్తున్నారు. రెండేండ్లు కరోనాతో పనులు ఆగడం, కాంట్రాక్టు కంపెనీకి సర్కార్ సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో 85 శాతం పూర్తయిన పనులు నిలిచిపోయాయి. ఇటీవల నిధులు విడుదల చేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల చివరి కల్లా పనులు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. ఇక ట్యాంక్ బండ్ వద్ద చేపట్టిన అమరవీరుల స్థూపం పనులు ఇప్పటికే సగం పూర్తయినట్లు తెలిపారు. జూన్ కల్లా పూర్తవుతాయని చెబుతున్నారు. 3 లక్షల చదరపు అడుగుల్లో రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అయితే అంచనా వ్యయం మరో రూ.29 కోట్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఫస్ట్ ఫ్లోర్ లో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీ, కాన్ఫరెన్స్ హాల్ , రెండో ఫ్లోర్ లో కన్వెన్షన్ సెంటర్ , మూడో ఫ్లోర్ లో రెస్టారెంట్ ను నిర్మిస్తున్నారు.