ఇనకపోతే పోలీసోళ్లు కొడుతరిక

ఇనకపోతే పోలీసోళ్లు కొడుతరిక

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్
ఆ తర్వాత దశలవారీగా ఎత్తివేతపై నిర్ణయం
1 నుంచి 9 క్లాస్ ల వరకు అందరూ ప్రమోట్
టెన్త్ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటం
మర్కజ్ కేసులు లేకుంటే ఆరాంగా ఉంటుంటిమి
లాక్డౌన్ పై ప్రధాని టైమ్లీ నిర్ణయం తీసుకున్నరు
ప్రస్తుతం ఇండియా మంచి స్థితిలో ఉంది
ఈ నెల 30 తర్వాత ఈ బాధ పోవాలని ప్రార్థిస్తున్న
డబ్బు సాయం కోసం ప్రధానికి లేఖ: సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఒక్కసారిగా లాక్ డౌన్ను ఎత్తివేయబోమని, దశలవారీగా ఎత్తివేసేందుకు నిరయ్ణం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవాళ్లంతా డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం మన దగ్గర 503 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఒకటి నుంచి 9వ క్లాస్ వరకు స్టూడెంట్స్ అందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించారు. టెన్త్ క్లాస్ పరీక్షలపై త్వరలో నిరయ్ణం తీసుకుంటామన్నారు. లాక్డౌన్ కు ఇప్పుడు ఇస్తున్న సహకారాన్ని ఇక ముందు కూడా ఇవ్వాలని, ప్రజలంతా 30 తారీఖు వరకు ఇండ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఇది మన క్షేమం కోసం.. మన పిల్లల భవిష్యత్ కోసం.. అందరి మంచిని కాంక్షించి చేసిందే. దీనికి అన్ని మతాల వాళ్లు, అన్ని కులాల వాళ్లు సహకరించాలి. ఏప్రిల్ 30 తర్వాత దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంటుంది” అని సీఎం అన్నారు. కరోనా నియంత్రణపై, లాక్డౌన్ పరిస్థితులపై శనివారం ప్రగతిభవన్లో సీఎం అధ్యక్షత కేబినెట్ మీటింగ్ జరిగింది. తర్వాత రాత్రి 9గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

శనివారం ఉదయం ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో దాదాపు అన్ని రాష్ట్రాలు రెండు వారాల పాటు అంటే ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ను పొడిగించాలని కోరాయని, తాము కూడా కోరామని కేసీఆర్ చెప్పారు. కేంద్రం కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తోందని, దీనిపై ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపునకు సంబంధించి ఒక లెటర్.. రాష్ట్ర డిమాండ్లకు సంబంధించి మరో లెటర్ను ప్రధానికి పంపుతున్నట్లు చెప్పారు.

మొత్తం పాజిటివ్ కేసులు 503

రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవాళ్లంతా డిశ్చార్జయ్యారని సీఎం పేర్కొన్నారు. ‘‘తొలి దశలో 25 వేల 337 మంది వివిధ క్వారంటైన్ సెంటర్లలో ఉన్నరు. వాళ్లంతా డిశ్చార్జయ్యారు. పాతవి, కొత్తవి కలుపుకొని.. శనివారం వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 503. ఇందులో 14 మంది చనిపోయారు. 96 మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జయ్యిండ్రు. యాక్టివ్ కేసెస్ 393 ఉన్నయి” అని వివరించారు. ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ వెళ్లి వచ్చినవాళ్లను, వాళ్ల రిలేటెడ్స్ సుమారు 12 వందల మందికి టెస్టులు చేయించామని, నెగిటివ్ వచ్చినోళ్లంతా డిశ్చార్జయ్యారని చెప్పారు. ప్రభుత్వ వాచింగ్లో 1654 మంది ఉన్నారని పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్24 వరకు ఆల్మోస్టు ఈ బ్యాచ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటది. హాస్పిటల్లో ఉన్నవాళ్లు నెగిటివ్ వచ్చి క్యూరయ్యి డిశ్చార్జవడం జరుగుతుంది. తర్వాత మన దగ్గర సమస్య ఉండదు.. కొత్త ఉప్పెన రాకుంటే బయటపడుతం” అని సీఎం పేర్కొన్నారు. కరోనా పాజిటివ్కేసులు ఉన్నప్రాంతాలను కంటెయిన్మెంట్ ఏరియాలుగా ప్రకటించి కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 243 కంటెయిన్మెంట్ ఏరియాలు ఉన్నాయన్నారు.

మర్కజ్ ఘటన లేకుంటే ఆరాంగా ఉంటుంటిమి
రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని, కఠినంగా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అందరూ సహకరించాలని కోరారు. ‘‘ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ ఘటన లేకపోతే.. ఆరాంగా ఉండెటోళ్లం. కానీ.. ఎప్పుడు ఎట్లమీద పడుతదో తెలియదు. మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నయి. అదే టెన్షన్. 100 శాతం మహారాష్ట్ర బార్డర్ కంటిన్యూ సీల్చేయాల్సి వస్తది’’ అని సీఎం అన్నారు.

అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ కు అనుమతి
‘‘తొలిసారి రాష్ట్రంలో పంటలు చాలా వస్తున్నయి. ఏప్రిల్ 15 వరకు అన్ని ఇరిగేషన్ల కింద వ్యవసాయానికి నీళ్లివ్వాలని కేబినెట్ నిర్ణయించింది”అని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వరి, మక్కలతోపాటు పప్పు శెనగలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ‘‘నాకు రైతుల మధ్య పండుగ జరుపుకోవాలని ఉండె.. ఈ రబీలో 45 లక్షల ఎకరాల్లో వరికోత, 15లక్షల ఎకరాల్లో మక్క కోస్తా ఉన్నరు.. ఇంత రావడం తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి సారి. కానీ.. కరోనా వల్ల నేను రైతుల మధ్యకు పోలేకపోయిన” అని చెప్పారు. వ్యవసాయ పనులకు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో భాగమైన రైస్ మిల్లులు, ఫ్లోర్ మిల్స్, ఆయిల్ మిల్లులకు ఇప్పుడు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు.

లాక్డౌన్ పొడిగించాలని ప్రధానిని కోరుతున్న
శనివారం ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారని, దాదాపు అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఈ నెల 30 వరకు లాక్డౌన్ పొడిగించాలని ఆయనను కోరారని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘‘మరో 15 రోజులు కండ్లు మూసుకొని గడిపిస్తే.. పరిస్థితి చక్కబడొచ్చు. యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రధాని సమావేశంలో నిర్ణయం జరిగింది” అని అన్నారు.

ఇండియా మంచి స్థితిలో ఉంది
‘‘కేంద్రం, రాష్ట్రాలు ఒక్కతాటిపై నిలబడి.. ప్రజలను కాపాడుకోవాలనే గొప్ప స్పిరిట్ తోటి ప్రధానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులమంతా శనివారం వీడియో కాన్ఫరెన్స్ లో అప్పీల్ చేసినం. ప్రధాని కూడా అదే తీరుగా అప్పీల్ చేసిండ్రు. లాక్డౌన్ పొడిగింపుపై ప్రధాని కూడా ప్రకటిస్తరు. ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే కరోనా నియంత్రణలో ఇండియా మంచిస్థితిలో ఉందని చెప్పొచ్చు. భగవంతుడ్ని కోరుతున్న.. ఈ నెల 30 వరకు ఈ మహమ్మారిని తరిమేస్తే మా పని మేం చేసుకుంటమని ప్రార్థిస్తున్న’’ అని సీఎం అన్నారు. దేశంలో కరోనా కట్టడి కోసం ప్రధాని కూడా టైంలీ డిసిషన్ తీసుకున్నారని, ఆయన ఇచ్చిన లాక్డౌన్ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయని చెప్పారు.

టెన్త్ పరీక్షలపై త్వరలో నిర్ణయం
స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయని, ఎస్సెస్సీ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ‘‘1 నుంచి 9 తరగతి వరకు అందరినీ పాస్ చేసినట్లు ప్రకటిస్తున్నం.. ప్రమోట్ చేస్తున్నం. ఇక ఆ పిల్లల తల్లిదండ్రులు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేశారు.

ఇనకపోతే పోలీసోళ్లు కొడుతరిక
‘‘లాక్డౌన్ను కచ్చితంగా పాటించాలె. ప్రజలు రోడ్ల మీదికి రావొద్దు. ఇనకపోతే కొడుతరిక పోలీసోళ్లు..తప్పదిక. కంటెయిన్మెంట్ ఏరియాల్లో నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ ఇస్తున్నం. తినుబండారాలు, నూనెలు కల్తీ చేసే వాళ్లపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేస్తం”అని సీఎం అన్నారు. ఈ నెల 30 వరకు ఫ్రీరేషన్ పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. రేషన్‌ కార్డు ఉన్నోళ్లకు బియ్యం ఇవ్వకపోతే డీలర్‌షిప్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్‌కార్డు దారులకు శుక్రవారం నుంచి రూ.1,500 వాళ్ల ఎకౌంట్లో జమ చేస్తున్నామని తెలిపారు. లిక్కర్ అమ్మకాలకు చాన్సేలేదని, ఎప్పుడో పాలసీని చెప్పామన్నారు.

For More News..

ఎన్ని కణాలుంటే వైరస్ సోకుతుందో తెలుసా..

న్యూయార్క్ లో ఏం జరుగుతుంది? కరోనా మరణాలు అక్కడే ఎందుకు ఎక్కువ?

మర్కజ్ వెళ్లొచ్చింది దాచి ఏకంగా ఆఫీసర్లతోనే తిరిగిండు

లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..