ఇల్లు అలకగానే పండుగ కాదు

ఇల్లు అలకగానే పండుగ కాదు

బ్రిటీష్​ మాజీ ప్రధాని హెరాల్డ్​ విల్సన్​ అన్నట్లు ‘రాజకీయాల్లో ఒక వారం కూడా చాలా సుదీర్ఘమైన కాలమే’. కేసీఆర్​ బీఆర్ఎస్​ ప్రకటించి వారం దాటింది. దీని వల్ల పెద్దగా జరిగిన మార్పేమీ లేదు. దీన​ అర్థం ప్రభావం లేదని కాదు. బీఆర్ఎస్​ముందుకు వెళ్తుందా? లేదా మెల్లమెల్లగా కనుమరుగవుతుందా? అనేది వేచి చూడాల్సిందేనని. ఓ రాష్ట్ర నాయకుడు జాతీయ ఆశయాలతో రాజకీయ పార్టీని స్థాపించడం భారతదేశ చరిత్రలో అరుదు. కానీ కేసీఆర్​ఆ పని చేశారు. అయితే బీఆర్ఎస్ ను ప్రస్తుతం​జాతీయ పార్టీ అని చెబుతున్నప్పటికీ కొన్ని ఎన్నికల తర్వాతే ఎన్నికల సంఘం దానికి జాతీయ పార్టీగా గుర్తింపునిస్తుంది. 

జాతీయ పార్టీ ఎవరి ఆలోచన?
తెలంగాణలో కేసీఆర్​కు బీజేపీ, కాంగ్రెస్​ ప్రత్యర్థులు. అసంతృప్త ఓట్లు చీలిపోయి తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించాలంటే రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్​లు ఉండాల్సిందేనని ఆయనకు తెలుసు. రెండు జాతీయ పార్టీలు తనను టార్గెట్​గా చేసుకున్నాయి కాబట్టి, వాటి నుంచి రక్షణ పొందడం, ఎదుర్కోవడం కోసం కేసీఆర్​కు ఒక కొత్త వ్యూహం కావాలి. బీజేపీ, కాంగ్రెస్​లను కాదని వివిధ రాష్ట్రాలను ఏలుతున్న మమతా బెనర్జీ, అరవింద్​ కేజ్రీవాల్, నవీన్​ పట్నాయక్​లాంటి ప్రాంతీయ నేతలతో కేసీఆర్​ కొంత సఖ్యతగా ఉన్నప్పటికీ, పొత్తు కుదుర్చుకునేందుకు వాళ్లు సిద్ధంగా లేరు. కేసీఆర్ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రకటనకు ముందు ఎవరితో చర్చించారు?  కేటీఆర్ లేదా హరీశ్ రావు వంటి కీలక నేతల అభిప్రాయాలు ఏమిటి? వాళ్లు తల ఊపారా ? లేదా ప్రశాంత్ కిశోర్ ఈ ఆలోచన  తెచ్చారా? ఈ రహస్యాలు బయటకు రావడానికి సమయం పడుతుంది. కానీ మొత్తానికి బీఆర్ఎస్ ​లాంచ్ అయింది.

కేసీఆర్ వ్యూహాలు ఏంటి?
ప్రాంతీయ పార్టీలకు మరిన్ని అధికారాలు కావాలని, బీఆర్ఎస్​ బీజేపీ, కాంగ్రెస్​లకు వ్యతిరేకమని కేసీఆర్​ పేర్కొన్నారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌లు మాత్రమే అధికారంలో ఉన్న రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్, చత్తీస్‌‌‌‌గఢ్, కర్నాటక, మధ్యప్రదేశ్, అస్సాం, హర్యానాలో బీఆర్‌‌‌‌ఎస్ మొదలు పోటీ చేయవచ్చని ఆయన అన్నారు. ఈ లెక్కన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీలపై కేసీఆర్ పోటీ చేయబోరు. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోనూ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యమే ఉంది కాబట్టి బహుశా ఆయన ఏపీలోనూ అడుగుపెట్టకపోవచ్చు. కర్నాటకలో ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి, మహారాష్ట్రలో వ్యవసాయ నేతలు, ఇతర రాజకీయ నాయకుల సహకారంతో కేసీఆర్​కొంత మంది అభ్యర్థులను బరిలో దింపొచ్చు. అక్కడ రాజకీయ నిరుద్యోగులుగా చాలా మంది నేతలు ఉన్నారు. అభ్యర్థుల ఏర్పాటులో అలాంటి వారి సాయం చేస్తారు. బీఆర్ఎస్​ ప్రధాన నినాదం ‘తెలంగాణ మోడల్’. తెలంగాణను బంగారు తునక చేశానని, భారత దేశం మొత్తం తెలంగాణను అనుకరించేలా చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఇప్పటికే అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను కొన్ని సీట్ల కోసం కేసీఆర్​అభ్యర్థించవచ్చు. అవి కూడా అందుకు సహకరించవచ్చు. ఎందుకంటే అవి ఎప్పుడూ ఓడిపోయే స్థానాలు కాబట్టి.

కాంగ్రెస్‌‌‌‌తో పొత్తు పెట్టుకుంటారా?
నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్​ పొత్తు పెట్టుకుంటారా అని విపక్షాలు చూస్తున్నాయి. 2023లో అధికారాన్ని నిలబెట్టుకోగలరా అనేది కేసీఆర్‌‌‌‌కు అత్యంత ముఖ్యమైన పరీక్ష. మునుగోడు ఎన్నిక ఫలితంతో దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదీ గాక నటుడు ప్రకాశ్​రాజ్‌‌‌‌, వీసీకే తిరుమలవళన్‌‌‌‌ వంటి వారిలాగ భారత రక్షణ, విదేశీ సంబంధాల గురించి చెడుగా మాట్లాడకుండా కేసీఆర్‌‌‌‌ జాగ్రత్తపడాలి. కేసీఆర్ ​విఫలమవడం అతని ప్రత్యర్థులు, ముఖ్యంగా కాంగ్రెస్ కు చాలా అవసరం. తెలంగాణ బయట ఆ పార్టీ సోకాల్డ్ మిత్రులు కొందరు మౌనంగా ఉన్నారు. -“ధైర్యవంతులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది” అని 2100 ఏండ్ల క్రితం రోమన్ కవి వర్జిల్ చెప్పిన మాటల నుంచి కేసీఆర్ ధైర్యం తీసుకోవచ్చు! బీఆర్ఎస్ ప్రకటించి కేసీఆర్ సరైన పని చేశారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ పార్టీ సంబరాలు ఐఏఎస్ పరీక్ష రాసిన విద్యార్థిలా ఉన్నాయి. ఫలితం ఏంటో తెల్వకపోయినప్పటికీ, కేవలం ఐఏఎస్​ పరీక్ష రాసినందుకు ఆ విద్యార్థి, అతని కుటుంబం సంబరాలు చేసుకుంటున్నట్లుగా ఉన్నది. బీఆర్ఎస్​ విజయవంతం కావడానికి, కేసీఆర్ చాలా పనులు చేయాల్సి ఉంది. 

కేసీఆర్​ ముందున్న సవాళ్లు ఏమిటి?
మిగులు బడ్జెట్​తో మొదలైన తెలంగాణను కేసీఆర్​ అప్పుల కుప్పగా మార్చారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అన్ని వేదికలపై నిందిస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఆర్థిక విధానం దేశంలో మరెక్కడా సుముఖంగా కనిపించకపోవచ్చు. కేసీఆర్ మహాత్మా గాంధీ లేదా జయ ప్రకాష్ నారాయణ్ వంటి దిగ్గజ నేత కాదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆయన గురించి తెలియదు. జయప్రకాష్ నారాయణ్ 1974లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించినప్పుడు, ఆయన త్యాగపూరిత జీవితాన్ని గడిపారని, 50 ఏండ్లుగా ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదని ప్రజలకు తెలుసు. గడిచిన 75 ఏండ్లలో భారతదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కేసీఆర్ అన్నారు. కానీ దేశం విపరీతమైన ఆర్థిక, సామాజిక పరివర్తనను చూసిందన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి కేసీఆర్​ వ్యాఖ్యలను ప్రజలు ఎంత వరకు నమ్ముతారనేది సందేహమే! భారతదేశం నేడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 75 ఏండ్ల క్రితం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఒకే స్థానంలో ఉన్నారా? ప్రజలను ఆందోళనకు గురిచేసే చైనా లేదా పాకిస్థాన్ వంటి జాతీయ భద్రత, అక్రమ వలసలు, ఇతర సమస్యలను కూడా కేసీఆర్ ప్రస్తావించలేదు. నరేంద్ర మోడీకి ఉన్న ప్రజాదరణలో ముఖ్యమైనదేమిటంటే.. ఆయన దేశ భద్రతపై బలంగా ఉన్నారు. కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మునుగోడు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటారా? చూడాలి. జాతీయ మీడియాకు ప్రకటనలు ఇవ్వడం తప్ప, జాతీయ మీడియా ఆయనకు ఇచ్చే ప్రాధాన్యం సరిపోదు. - డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్