ఎన్నికల సంస్కరణలు రావాలి

ఎన్నికల సంస్కరణలు రావాలి

ఎన్నికలను పారదర్శకంగా నిబంధనల మేరకు  నిర్వహించడంలో ఎన్నికల కమిషన్(ఈసీ) విఫలమవుతున్నదని, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని ఎన్నికల తేదీలను నిర్ణయిస్తుందనే ప్రధానమైన ఆరోపణలను ఈసీ ఎదుర్కొంటున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమకి అనుకూలంగా వ్యవహరించే అధికారులను ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నారనే  ఆరోపణలు ఉన్నాయి. భారత ఎన్నికల కమిషన్ కు కమిషనర్లను నియమించడానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటు చేయాలనే పిటిషన్ పైన కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ ను నియమించటం ఆ నియామకంపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఎన్నికల  కమిషనర్ల నియామకంపై చర్చ జరుగుతున్నది. ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడమే కాదు నిష్పక్షపాతంగా తన విధులను నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. శేషన్  లాంటి వారు కావాలి. భారత్ ఎన్నికల కమిషన్ కు10వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించిన టీఎన్ శేషన్ ఎన్నికల సంస్కరణలను తీసుకురావడంలో, ఎన్నికల కమిషన్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావటంలో తనదైన ముద్రవేశారు. ఓటర్ ఐడీ కార్డు, అనుమతి లేకుండా గోడలపై రాతలు, మైకులు వాడటంపై నిషేధం, ఎన్నికల్లో ఖర్చుకు పరిమితి విధించటం, మతపరమైన ప్రదేశాల్లో, విద్యాసంస్థల్లో ఎన్నికల ప్రచారం పై నిషేధం, సంస్థాగత ఎన్నికలు నిర్వహించని పార్టీల గుర్తింపు రద్దు లాంటి సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు. దీంతో ఎన్నికల విధానంలో కొంతమేరకు మార్పు వచ్చింది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్లు అమలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామక ప్రక్రియపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఎన్నికల కమిషన్ కు శేషన్ లాంటి ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ కావాలని వ్యాఖ్యానించింది. 

సమర్థంగా, పారదర్శకంగా..

దేశంలో ఎన్నికలను పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ మరిన్ని కఠినమైన  సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఓటర్ల నమోదులో జరుగుతున్న అవకతవకలు, ఎన్నికల సమయంలో పార్టీల అభ్యర్థులు నిబంధనలను అతిక్రమించి పెడుతున్న ఖర్చు, ఓటర్లకి పంచుతున్న మద్యం, డబ్బులను నియంత్రించడం, ప్రలోభాలను తగ్గించడం లాంటి విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఒక పార్టీ రూ.5 వేలు, మరొక పార్టీ రూ. 4 వేలు ఓటర్లకు పంచిందని, పార్టీలు ఇచ్చిన డబ్బులు తీసుకున్నామని ప్రచార మాధ్యమాల సాక్షిగా ప్రజలు చెబుతున్నా  ఆ పార్టీలపై చర్యలు చేపట్టలేని పరిస్థితి ఈసీది. కాబట్టి ప్రస్తుతం ఉన్న నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి పౌర సమాజం ఆశిస్తున్న విధంగా ప్రలోభాలను నియంత్రించడానికి కొత్త సంస్కరణలు తీసుకురావడానికి ఈసీ స్వతంత్రంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. 

స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుతో..

రాయ్ బరేలి లోక్ సభ స్థానంలో ఇందిరా గాంధీ పై పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ ఇందిరాగాంధీ ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచారు కాబట్టి తన ఎన్నికను రద్దు చేయాలని అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంలో అలహాబాద్ హైకోర్టు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేస్తూ రాజ్ నారాయణ గెలిచినట్లుగా తీర్పునివ్వడంతో పాటు ఇందిరా గాంధీ ఆరేండ్లపాటు ఏ ఎన్నికలో పోటీ చేయరాదని తీర్పును ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అదే ప్రశ్నను లేవనెత్తుతున్నది. ప్రధానమంత్రితో ఎన్నికల కమిషన్ తలపడే సందర్భం వస్తే ప్రధానిపై ఆరోపణలు వస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోగలరా ? భారతదేశంలో అత్యంత కీలకమైన బాధ్యతలు గల సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ లు స్వతంత్రంగా వ్యవహరించడానికి, పనిచేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ ఉన్నట్లుగానే, ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు అవసరం. -  డా. తిరునహరి శేషు, పొలిటికల్​ ఎనలిస్ట్