అందుకే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు : రాహుల్ గాంధీ

అందుకే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు :  రాహుల్ గాంధీ

జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.  రామ మందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ సొంత పంక్షన్ లాగా నిర్వహిస్తున్నాయని ఆరోపించారు.  ఇది ప్రధాని మోదీ చుట్టూ తిరిగే ఓ రాజకీయ కార్యక్రమం అని తాము భావిస్తున్నామని చెప్పారు.  అందువల్లే తాము ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలిపారు.  భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా నాగాలాండ్ లో రాహుల్ ఈ కామెంట్స్ చేశారు. 

మరోవైపు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీని ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  మిత్రపక్షాలతో సీట్ల పంపకాల చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు. కూటమిలోని చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయని, తాము కలసికట్టుగా విజయం సాధిస్తామని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.  సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాడేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్‌లో ప్రారంభమైన యాత్ర సోమవారం సాయంత్రం నాగాలాండ్‌కు చేరుకుంది. 

అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠాపన జరగనుంది.  వేడుకకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.  ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.