
- బీజేపీ అసలు దోషి అంటున్న సీపీఐ సాంబశివరావు
- రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టిన బీసీ సంఘాల నేత కృష్ణయ్య
- బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయన్న బీజేపీ రాంచందర్ రావు
- చిత్తశుద్ధితో ప్రయత్నించామంటున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ఢిల్లీలో కొట్లాడితే వస్తామంటున్న బీఆర్ఎస్ నేత హరీశ్ రావు
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన జీవో నంబర్ 9పై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. దీని ప్రభావం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై పడింది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలకు బ్రేకులు పడ్డాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏక గ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే. తర్వాత పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణలు చేస్తూ మరో ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును గవర్నర్ న్యాయ సమీక్ష కోసం కేంద్ర హోంశాఖకు, అటు నుంచి రాష్ట్ర ప తికి పంపారు.
పార్లమెంటులో ప్రవేశపెట్టి తొమ్మిదో షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించింది. ఆతర్వాత జీవో నంబర్ 9 జారీ చేయడంతో.. దాని ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై రాష్ట్రంలోని పార్టీలన్నీ ఘాటుగా స్పందించాయి. బీసీ రిజర్వేషన్లకు అసలు దోషి బీజేపీ అని సీపీఐ నేతన కూనం నేని సాంబశివరావు విమర్శిస్తున్నారు. బీజేపీ ఎంపీ, బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అనుమానాలున్నాయని అన్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్టే ఇవ్వడం దారుణమని చెబుతున్నారు. రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని రాజ్యంగంలోని ఆరో షెడ్యూల్ లో స్పష్టంగా ఉందని అన్నారు.
►ALSO READ | ఐలాండ్ అద్భుతం.. చుట్టూ నీళ్లు మధ్య లో అరెకరం... వెయ్యి మంది జనాభా.. ఒక్కడే డాక్టర్
కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. బీసీలు ఎంత ఉన్నారో.. తమకు అంత రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అంటున్నారు. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ఉందంటున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించిందని, బీజేపీ రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టి ఉంటే ఈ సమస్యే వచ్చేది కాదన్నారు. ఢిల్లీలో కొట్లాడితే వస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చెబుతున్నారు. తొమ్మిదో షెడ్యూల్ లో పెడితేనే న్యాయం జరుగుతుందని పదే పదే చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని బీఆర్ఎస్ శాసన మండలి పక్ష నేత మధుసూదనా చారి అంటున్నారు.