అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. గెలిచే సత్తా ఉన్నవారిపైనే పార్టీల దృష్టి

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. గెలిచే సత్తా ఉన్నవారిపైనే పార్టీల దృష్టి
  • ఆర్థిక బలం, అంగ బలం ఉన్నవారికి ప్రాధాన్యం

మెదక్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో ఊర్లలో రాజకీయాలు వేడెక్కాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగనప్పటికీ అభ్యర్థులు ఏదో ఒక పార్టీ మద్దతుతోనే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాయి. ఈ మేరకు జిల్లాలో మెజారిటీ సర్పంచ్​ పదవులను దక్కించుకోవడం లక్ష్యంగా  కాంగ్రెస్​, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహ రచన మొదలుపెట్టాయి.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్​ పదవులకు పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్​చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులదే కీలక పాత్ర. 

ఈ మేరకు  సర్పంచ్​ స్థానాల్లో పోటీచేయాలనుకుంటున్న  కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలకు చెందిన నాయకులు తమ నియోజకవర్గ ఎమ్మెల్యే, పార్టీ ఇన్​చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షుల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తరపున బరిలో దిగాలనుకుంటున్న వారు ఎంపీ రఘునందన్​ రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, అసెంబ్లీ కన్వీనర్​లు, వివిధ మెర్చాల బాధ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. 

మళ్లీ యాక్టివ్​ అయ్యారు..

చాలా కాలంగా సర్పంచ్​ పదవికి పోటీ చేయాలని ఆశిస్తూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, వివిధ అభివృద్ధి పనులకు, ఆలయాలకు, ఉత్సవాలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టిన వారు మళ్లీ యాక్టివ్​ అయ్యారు. గత సెప్టెంబర్​ లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు గ్రామాల్లో వివిధ వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు దావత్​లు ఏర్పాటు చేసిన వారు కోర్టు తీర్పు కారణంగా  ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అని స్తబ్దుగా ఉన్న వారు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంలో ఓట్ల కోసం మళ్లీ జనాల బాట పట్టారు. 

అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని..

ఆశావహుల్లో గెలిచే సత్తా ఎవరికి ఉందనే దానిపై రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి. చాలా పంచాయతీల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీకి సై అంటున్నారు. గ్రామంలో ఎవరికి పట్టు ఉంది? ప్రజలతో సత్సంబంధాలు ఎవరికి ఉన్నాయి? ప్రత్యర్థి అభ్యర్థులను ఎవరైతే దీటుగా ఎదుర్కోగలుగుతారు? ఆర్థిక, అంగ బలం ఎవరికి ఉంది? అనే అంశాలు పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మరోవైపు పార్టీ మీటింగ్ లు ఏర్పాటు చేసి ఏ పంచాయతీలో  ఎవరిని బరిలో దింపుదామనే దానిపై పార్టీ ముఖ్య నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు.