- క్లీన్ స్వీప్ చేసేందుకు అధికార పార్టీ కసరత్తు
- 20 స్థానాల్లో 15 స్థానాలకు చైర్ పర్సన్ అవకాశం
- 6 జనరల్ మహిళ, 4 జనరల్, 5 బీసీలకు రిజర్వ్డ్
- మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడంతో ఖర్చుకు వెనకాడని ఆశావహులు
ములుగు, వెలుగు : ములుగు కొత్త మున్సిపాలిటీపై ఆశావహుల అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 2019 ఫిబ్రవరి 17 న ములుగు జిల్లా ఏర్పాటు కాగా, ఇన్నేళ్లు జిల్లా కేంద్రం జీపీగా ఉన్న ఏకైక స్థానం ములుగుగానే కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగా, 2025 ఏప్రిల్ 5న ములుగు జీపీతోపాటు బండారుపల్లి, జీవంతరావుపల్లి జీపీలు కలిపి కొత్త మున్సిపాలిటీగా అవతరించింది.
త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగనుండగా, కొత్త మున్సిపాలిటీ అయిన ములుగుపై ఎక్స్పెక్టేషన్లు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే రిజర్వేషన్ స్థానాలు కూడా అత్యధికంగా బీసీ, మహిళలు, జనరల్ స్థానాలుగా కేటాయించారు.
20 స్థానాల్లో 15స్థానాలకు చైర్ పర్సన్ అవకాశం..
రాష్ట్రంలోని మున్సిపాలిటీ చైర్మన్ల రిజర్వేషన్ ఖరారు కాగా, ములుగు స్థానం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. మొత్తం 20వార్డులకు గానూ 15వార్డు స్థానాల్లో చైర్ పర్సన్ గా బరిలో నిలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియలో ఎస్టీకి 2, ఎస్సీకి 3 స్థానాలు కేటాయించగా, బీసీ మహిళ 2, బీసీ జనరల్ 3, జనరల్ స్థానాలు 4, జనరల్ మహిళ 6 స్థానాలకు కేటాయించారు. దీంతో మొత్తం 15 స్థానాల్లో బీసీ మహిళలు పోటీ చేసే అవకాశం ఉండడంతో , ఆశావహుల నుంచి గట్టి పోటీ నెలకొంది.
భారీగా అంచనాలు..
కొత్త మున్సిపాలిటీ అయిన ములుగు జిల్లా కేంద్రం కావడంతో వార్డు స్థానాలతో పాటు చైర్ పర్సన్ పీఠం దక్కించుకునేందుకు వెనకాడేది లేదంటూ సవాళ్లు విసురుతున్నారు. అంచనాలు పెరుగుతుండడంతో అధికార పార్టీ నేతలు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు, ఎంత ఖర్చయినా వెనకాడేది లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ఇందుకోసం మద్దతుదారులను పోగేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ గట్టిపోటీ ఇచ్చి కొన్ని స్థానాలనైనా దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే మున్సిపాలిటీ పీఠం, వార్డు స్థానాల టిక్కెట్ల కోసం మంత్రి సీతక్క ఆశీస్సులు ఎవరికి ఉండనున్నాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ అత్యధిక స్థానాల గెలుపు కోసం ఇన్చార్జీలను కూడా నియమించిన విషయం తెలిసిందే. అభ్యర్థులను స్క్రూటినీ చేసి గెలుపు గుర్రాలను ఏరి ములుగు మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేసే దిశగా పావులు
కదుపుతోంది.
గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల కసరత్తు..
ములుగులో అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే సంకల్పంతో పావులు కదుపుతుండగా, బీఆర్ఎస్ సైతం తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది.
బీజేపీ అన్ని స్థానాల్లో పోటీలో ఉండాలని భావిస్తోంది. ఆయా పార్టీల ఇన్చార్జిలు ములుగు మున్సిపాలిటీ పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని బరిలో నిలిచేవారి పేర్లను పరిశీలించి, పేర్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, పార్టీల నుంచి టికెట్లు రాని పక్షంలో స్వతంత్రులుగా బరిలో దిగేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. చైర్ పర్సన్ అవకాశం ఉన్న వార్డు స్థానాల్లో ఒక్కో స్థానానికి 10 మందికిపైగా బరిలో నిలిచే అవకాశం ఉంది.
