
మంచిర్యాల,వెలుగు: ప్రభుత్వం వివిధ శాఖల్లో రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయకుండా ఔట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టడం కొంతమంది ప్రజాప్రతినిధులు, లీడర్లు, అధికారులు, ఏజెన్సీల నిర్వాహకులకు వరంగా మారింది. గవర్నమెంట్ ఆఫీసులు, హాస్పిటళ్లలో రూల్స్ ప్రకారం భర్తీ చేయాల్సిన పోస్టులకు లక్షల్లో రేటు కట్టి ఫిక్స్ చేసి అమ్ముకుంటున్నారు. ఔట్ సోర్సింగ్ పోస్టులకు ఇంటర్, టెన్త్, ఆలోపు విద్యార్హతలు నిర్ణయించడంతో ఒక్కో పోస్టుకు వందల మంది పోటీపడుతున్నారు. దీంతో డిమాండ్‌ను బట్టి లక్ష నుంచి రెండున్నర లక్షల దాకా వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. కానీ ప్రజాప్రతినిధులు, రూలింగ్ పార్టీ లీడర్లు, సంబంధిత డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, ఏజెన్సీల నిర్వాహకులు ఇదో ఆదాయ వనరుగా మలచుకొని అందినంత దోచుకుంటున్నారు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు పది పదిహేను వేలకు మించి జీతాలు ఇవ్వడం లేదు. అయినప్పటికీ చాలామంది నిరుద్యోగులు అప్పులు చేసి అడిగినంత సమర్పించుకుంటున్నారు. దీంతో కనీసం ఏడాది నుంచి రెండేండ్ల జీతం అప్పులకే పోతోంది.
రూ.లక్షల్లో వసూళ్లు...
బెల్లంపల్లిలోని 30 బెడ్స్ హాస్పిటల్100 బెడ్స్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. ప్రస్తుతం ఇక్కడ 15 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. స్వీపర్స్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో సేవలందించేందుకు మరో 25 మంది వర్కర్లు అవసరం. ఇదే అదునుగా కొంతమంది రూలింగ్ పార్టీ లీడర్లు ఔట్ సోర్సింగ్ పోస్టులు పెట్టిస్తామని ఆశచూపి నోటిఫికేషన్ రాకముందే వసూళ్లకు తెరలేపారు. ఒక్కొక్కరి దగ్గర రూ.2.50 లక్షల చొప్పున రూ.అరకోటికి పైగా వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
లక్సెట్టిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో 14 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ఒక ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు తమ వాళ్లను పెట్టుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరికి వారు తమ మనుషులను పనిలో పెట్టారు. దీంతో 14 మంది పనిచేయాల్సిన చోట 25 మంది అయ్యారు. నెలలు గడుస్తున్నా జీతాలు రాకపోవడంతో కొందరు బంద్ చేయగా, మరికొందరిని తొలగించారు. ప్రస్తుతం 17 మంది పనిచేస్తున్నారు. వీరి దగ్గర ప్రజాప్రతినిధులు, లీడర్లు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది.
+ మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇటీవల స్వీపర్స్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో 140 మంది ఔట్ సోర్సింగ్ వర్కర్లను నియమించారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ఏజెన్సీ నిర్వాహకులు ఒక్కొక్కరి దగ్గర రూ.లక్షన్నర నుంచి రెండు రూ.2లక్షలు తీసుకుని ఈ జాబ్‌లు పెట్టించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
అన్ని డిపార్ట్మెంట్లలో వాళ్లే...
ప్రభుత్వం ఆయా డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న కిందిస్థాయి ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయకుండా ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించుకుంటోంది. ఫలానా డిపార్ట్మెంట్ మాత్రమే అని కాకుండా దాదాపు అన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. హౌస్ కీపింగ్ మొదలు సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, టెక్నీషియన్లతో పాటు ఆపై స్థాయిలో సేవలందిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. జిల్లాలో 30కి పైగా ఏజెన్సీల ద్వారా సుమారు 500 మంది విధులు నిర్వహిస్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా 30వేలకు పైగా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు.
అరకొర జీతాలు... ఆపై కటింగ్‌లు...
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గవర్నమెంట్ ఇచ్చే జీతాలే తక్కవంటే అందులోనూ ఏజెన్సీలు కోతలు పెడుతున్నాయి. ఉదాహరణకు ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి రూ.15వేల జీతం అనుకుంటే... అందులో 3 పర్సెంట్ ఏజెన్సీ కమీషన్, 12 పర్సెంట్ ఈపీఎఫ్, 7.5 పర్సెంట్ ఈఎస్ఐ కట్ చేసుకుని మిగతా మొత్తాన్ని చెల్లించాలి. కానీ... కొన్ని ఏజెన్సీలు ఎంప్లాయీస్ దగ్గర రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనంగా కట్ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ఏజెన్సీలు ఈపీఎఫ్, ఈఎస్ఐ వాటాలు కట్టకుండా ఆ పైసలు జేబులో వేసుకుంటున్నాయి. ఈపీఎఫ్‌లో ఎంప్లాయి షేర్ 12 పర్సెంట్ కాగా, మరో 12 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఏజెన్సీలు ఎంప్లాయి షేర్ మాత్రమే కట్టి, సర్కారు చెల్లించే మొత్తాన్ని మింగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.