పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్(భీమారం), వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం ఆయన జైపూర్, భీమారం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో అర్హత గల వారి వివరాలు మాత్రమే ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జైపూర్​లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్​ను తనిఖీ చేశారు. భీమారం మండలం పోలంపల్లి, కాజిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వెల్లపల్లి శివారులో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు.

 భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్ ఆఫీసులో పరిశీలించారు. కాజిపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను స్పీడప్​ చేయాలని సూచించారు. ఎంపీడీవో ఆఫీస్​ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత 

నస్పూర్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్​లో డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణతో కలిసి పోలీస్, రవాణా, రోడ్లు -భవనాలు, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెడ్​క్రాస్ సొసైటీ ప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్) లను గుర్తించి వాహనదారులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. విస్తృతస్థాయి తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలన్నారు.