జనం లేక వెలవెలబోయిన సభా ప్రాంగణం

జనం లేక వెలవెలబోయిన సభా ప్రాంగణం

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేపట్టిన 3,500 కిలోమీటర్ల పాదయాత్రలో మొదటిరోజే గట్టి షాక్ తగిలింది. సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యంగా తలపెట్టిన ఈ పాదయాత్ర మొదటిరోజు బిహార్‌లోని పశ్చిమ చంపారణ్‌ జిల్లా బేతియాలో నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సభా ప్రాంగణం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. జనం లేక సభ వెలవెలబోయింది. కొద్దిమంది మినహా స్థానికులెవ్వరూ ఆయన సభకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచించడంలో అద్భుత విజయాలు సాధించిన ప్రశాంత్‌ కిశోర్‌.. క్షేత్రస్థాయిలో జనాలను ఆకర్షించడంలో విఫలమవుతారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

'జన్ సూరజ్' ప్రచారంలో భాగంగా జాతిపిత జయంతి రోజున బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉన్న గాంధీ ఆశ్రమం నుండి ప్రశాంత్ కిషోర్ 'పాదయాత్ర' ను ప్రారంభించారు. ఈ యాత్ర పూర్తి కావడానికి 12 నుంచి 15 నెలల సమయం పట్టనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్తకు ఆయన అనుచరులు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రకు ముందు  బిహార్ అభివృద్ధిపై కిషోర్ పలువ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత వెనకబడిన బీహార్ రాష్ట్రాన్ని బాగు చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బీహార్ లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని, గ్రామస్థాయిలో ప్రతి పౌరుడిలో రాజకీయ చైతన్యం తీసుకొస్తానన్నారు. రాజకీయాల్లో రాణించే సత్తా ఉన్నవాళ్లను ప్రోత్సహిస్తానని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.