స్ట్రాటజీ పాలిటిక్స్!

స్ట్రాటజీ పాలిటిక్స్!

రాజకీయం అంటే ఏంటి? పార్టీలు.. లీడర్లు.. కేడర్.. ప్రెస్ మీట్లు.. స్పీచ్​లు.. ప్రచారాలు. జనం ఓట్లేసి గెలిపిస్తే పాలించడం.. ఓడగొడితే ప్రతిపక్షంలో కూర్చోవడం. అధికార పార్టీ పాలన నచ్చితే జనం మళ్లీ గెలిపిస్తారు. ఓడగొడితే ప్రతిపక్షం గెలుస్తుంది. కొన్ని దశాబ్దాల పాటు మనదేశంలో, రాష్ట్రంలో మనకు కనిపించిన రాజకీయం ఇదే. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రాజకీయం అంటే ‘గెలుపు’ మాత్రమే. ఇంతకుముందు రాజకీయానికి... ఇప్పుడు అర్థం మారిన రాజకీయానికి మధ్య ఉన్న తేడానే స్ట్రాటజీ. 

గెలవడానికి స్ట్రాటజీ. గెలిచాక అధికారాన్ని నిలబెట్టుకోవడానికి స్ట్రాటజీ. ప్రతిపక్షాన్ని బలహీనం చేయడానికి అధికార పార్టీకి ఒక స్ట్రాటజీ. పవర్​లో ఉన్న పార్టీని దెబ్బతీయడానికి ప్రతిపక్షానికి ఇంకో స్ట్రాటజీ. దేనికైనా స్ట్రాటజీనే. ఒకప్పటి రాజకీయంలో పార్టీని నడిపించిన లీడర్ పేరు మాత్రమే చెప్పుకునేవాళ్లు. ఇప్పటి రాజకీయంలో ఆ లీడర్ తో పాటు వెనకున్న స్ట్రాటజిస్ట్ పేరు కూడా చెప్తున్నారు. మరి ఈ మార్పు మధ్యలో ఏం జరిగింది? రాజకీయం ఏం మారింది? ఎందుకు మారింది? స్ట్రాటజిస్ట్​లపై ఆధారపడడం బలమా? బలహీనతా? ఈ మారిన రాజకీయం ప్రజలకు మరింత మేలు చేస్తోందా? గతం కంటే తీరని నష్టం చేస్తోందా? అన్న ప్రశ్నలే ఇంట్రెస్టింగ్ చర్చకు తెర తీస్తున్నాయి. 

స్ట్రాటజిస్ట్ అంటే..?

ఏదైనా టార్గెట్​ను సాధించడానికి ఏం చేయాలి? ఎట్లా చేయాలి? అన్న ప్లాన్​ తయారుచేసి దాని అమలులో కూడా కీలకపాత్ర పోషించేవాడు స్ట్రాటజిస్ట్. సింపుల్​గా చెప్పాలంటే.. స్ట్రాటజీ తయారుచేసేవాడు స్ట్రాటజిస్ట్. కానీ ఇప్పటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్​లు అట్లాంటివాళ్లు కాదు. ప్లాన్​లో భాగంగా ఒకపక్క లీడర్లు, పార్టీలతో చేయించాల్సింది చేయిస్తూనే, మరోపక్క అంతకంటే ఎక్కువగా తాను అమలుచేయడమే ఇప్పటి స్ట్రాటజిస్టు స్పెషాలిటీ. ఇందులో భాగంగానే గోల్​ను నిర్ణయించడం, దాన్ని చేరుకోవడానికి చేసే ఆలోచనలు, ఒకటొకటిగా చేయాల్సిన యాక్షన్ ప్లాన్లు, వాటిని అమలుచేయడానికి అవసరమైన రిసోర్స్​లను రెడీ చేసుకోవడం లాంటివన్నీ ఉంటాయి. మొత్తంగా అందుబాటులో ఉన్న రిసోర్స్​లను వాడుకుంటూ, కావాల్సిన టార్గెట్​ను చేరుకునే ప్రాసెస్ మొత్తాన్ని స్ట్రాటజీ అనొచ్చు. ఇలాంటి ప్లానింగ్, వ్యూహాలు నిజానికి బిజినెస్ రంగంలో బాగా వాడుతుంటారు. బిజినెస్​ను సక్సెస్ చేయడం, విస్తరించడం లాంటి అవసరాల కోసం వాడుకునే స్ట్రాటజీలు ఇప్పుడు రాజకీయాల దాకా వచ్చాయి. ఎలక్షన్ క్యాంపెయిన్​లతో మొదలుపెట్టి వ్యక్తిగత బ్రాండింగ్, నెగిటివ్ ముద్రలను పోగొట్టి పాజిటివ్ ఇమేజ్ తేవడం, పాలన నిర్ణయాలపై పాజిటివ్ అభిప్రాయాన్ని సృష్టించడం, అధికారాన్ని నిలబెట్టుకోవడం లాంటి వాటికి కూడా స్ట్రాటజీలను వాడుకునే వరకు వచ్చింది.

అమెరికా నుంచి ఇండియా దాకా..

అమెరికా లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో పొలిటికల్ కన్సల్టెన్సీలు ఉన్నాయి. అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ ఎక్కువ కాలం సాగుతుంది. కాబట్టి చాలా ముందునుంచే క్యాంపెయినింగ్ చేస్తుంటారు. దీనికి సూచనలు ఇవ్వడానికి, సహకారం అందించడానికి పొలికటిల్ కన్సల్టెన్సీలు పనిచేస్తుంటాయి. అమెరికాలో మొదలైన ట్రెండ్ ఇప్పుడు అన్ని దేశాలకూ పాకింది. మనదేశంలో కన్సల్టెంట్ అనే పేరు కంటే స్ట్రాటజిస్ట్ అనే పేరే బాగా పాపులర్ అయింది. 2014కంటే ముందే మనదేశంలో స్ట్రాటజిస్ట్​లు ఉన్నారు. కానీ వాళ్లు పార్టీ నాయకులుగా, ముఖ్య నేతలకు సహచరులుగానే ఉంటూ తెరవెనుక పాత్రనే పోషించేవాళ్లు. వాళ్ల వ్యూహాలు చాలావరకు క్యాంపెయిన్​కే పరిమితంగా ఉండేవి. ఇప్పుడు వారి రోల్ చాలా మారిపోయింది. గతంలో రాజకీయ సలహాదారులు, పబ్లిక్‌‌ ఒపీనియన్‌‌ సేకరించి ఇచ్చే సర్వే ఏజెన్సీల పాత్ర.. రెండూ కలిసిపోయి ఇప్పుడు పొలిటకల్‌‌ స్ట్రాటజిస్ట్‌‌ అనే కొత్త రోల్‌‌ను సృష్టించాయి. స్ట్రాటజిస్ట్ అనగానే ఎవరికైనా పీకేగా పేరున్న ప్రశాంత్ కిశోర్ గుర్తొస్తాడు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ క్యాంపెయిన్​లో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటికీ పనిచేశాడు. పదేండ్ల కింద వరకు సంప్రదాయ రాజకీయాలు సాగిన మనదేశంలో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. అందుకు ఉదాహరణ దాదాపుగా ప్రతిపార్టీకీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఉండడమే. 

పొలిటికల్ స్ట్రాటజిస్టుల పనేంటి?

  • జనం ఆలోచనలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ఫీల్డ్ సర్వేలు
  • జనం ఏం కోరుకుంటున్నారు అన్న అంశాల ఆధారంగా క్యాంపెయిన్ డిజైన్
  • పార్టీ కేడర్​ను మొబిలైజ్ చేయడానికి టెక్ సొల్యూషన్స్ అందించడం
  • బూత్ లెవల్ కార్యకర్తలకు చేరేలా ప్రచార అంశాలు అందించడం
  • లీడర్ల ప్రచారానికి, ప్రసంగానికి అవసరమైన సూచనలు ఇవ్వడం
  • మీడియా ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ఐడియాలు, కంటెంట్ తయారుచేయడం
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వలంటీర్లను హైర్ చేసుకోవడం
  • రాజకీయ ప్రత్యర్థుల కీలక, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వీక్ పాయింట్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేయడం
  • ఓటర్లను అనుకూలంగా మలచుకోవడానికి ఏం చేయాలన్న ఐడియాలు
  • అమలవుతున్న ప్లాన్లు ప్రభావం తెలుసుకోవడం కూడా కీలకం 

స్ట్రాటజీకి ఆయుధం డేటానే

సంప్రదాయ రాజకీయం సమస్యలు, అంశాల ఆధారంగా సాగింది. ఎలక్షన్లు వచ్చాయంటే కొన్ని ఇష్యూస్ ఆధారంగా ‘వీళ్లు గెలవచ్చు, వాళ్లు ఓడిపోవచ్చు’ అని పైపై అంచనా మాత్రమే వేయగలిగేవాళ్లు. ఎలక్షన్ ఫలితాల తర్వాత అంచనాలు తలకిందులు కావచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పటి రాజకీయాన్ని, దానికి పనిచేసే స్ట్రాటజిస్టులను నడిపించే ఇంధనం... డేటా. రకరకాల అంశాలపై విస్తృతంగా అందుబాటులో ఉన్న మీడియా, సోషల్ ప్లాట్ ఫాంల ద్వారా జనం నాడిని పట్టుకోవడమే స్ట్రాటజీలో కీలకం. ఇలా సేకరించిన డేటాను విశ్లేషించి తమకు కావాల్సిన టార్గెట్లను నిర్ణయించుకుంటారు. జనం ఏ అంశాలపై ఎక్కువగా ఆలోచిస్తున్నారు? దేన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? ఏం అందిస్తే వాళ్లు తృప్తి చెందుతారు? ఇటువంటి అంశాలపై స్పష్టమైన డేటా ఆధారంగా ప్లాన్లు తయారుచేసుకుంటున్నారు. సోషల్ మీడియా, కొత్త టెక్నాలజీలే ఈ వ్యూహాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 

స్ట్రాటజీలను నమ్ముతున్న పార్టీలు అప్పటి వరకు పాటించిన సంప్రదాయ విధానాలను కూడా పక్కనబెడుతున్న పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించి, వాళ్ల నాయకత్వంలోనే ఎలక్షన్​కు వెళ్లే అలవాటున్న బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టింది. వ్యూహాలతో గెలుపు పక్కా అనుకున్నప్పుడు గెలిచాక ఈక్వేషన్​ను బట్టి సీఎంను ఎంపిక చేయొచ్చన్న ఆలోచనకు వచ్చింది. మరోవైపు ముందే సీఎం అభ్యర్థిని చెప్పే అలవాటు లేని కాంగ్రెస్ తన పద్ధతి మార్చుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్​కు ముందు సీఎం అభ్యర్థిని చెప్తేనే సోషల్ ఈక్వేషన్ పనిచేస్తుందన్న ఆలోచనకు వచ్చింది. నాటి సీఎం చన్నీనే అభ్యర్థిగా ప్రకటించినా ఆ ఎలక్షన్లో పార్టీకి ఓటమి తప్పలేదు.

మాకో స్ట్రాటజిస్ట్ కావాలి

దేశంలో, రాష్ట్రాల్లో దిగ్గజాలుగా పేరున్న లీడర్లు, పార్టీలు కూడా స్ట్రాటజిస్ట్​లను పెట్టుకోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. దీనికి కారణం మారిన మీడియా, టెక్నాలజీలే అంటున్నారు లీడర్లు. గొప్ప స్పీచ్​లు ఇచ్చేవాళ్లయినా, డబ్బు, కులం లాంటివి ఎన్నున్నా మారిన ట్రెండ్​లో నిలబడడం కష్టమన్న అభిప్రాయం లీడర్లలో కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత ఉన్నా గెలిచేలా పరిస్థితిని మలచుకోవడానికి స్ట్రాటజిస్ట్ ఐడియాలను తీసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నా సీన్ రివర్స్ చేయడానికి స్ట్రాటజిస్ట్​లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యమైన లీడర్ స్పీచ్​లో ఏం మాట్లాడాలి? ఏ నినాదం ఇవ్వాలి?  జనాన్ని ఏం అడగాలి? వాళ్లకి ఏం చేస్తామని చెప్పాలి? చివరికి ఏ పంచ్ డైలాగ్ కొట్టాలి? అనేది కూడా స్ట్రాటజిస్ట్​లే నిర్ణయిస్తున్నారు. దీనికి అదనంగా పార్టీ ఎజెండాలో జనంలోకి పోవాల్సిన అంశాలను సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫాంలలో హైలైట్ అయ్యేలా చూడడం, ప్రత్యర్థి పార్టీ లేదా లీడర్​కు సంబంధించిన లోపాలను హైలైట్ చేయడం కూడా ప్లాన్​లో భాగమే. తమకు నెగెటివ్‌‌గా మారిన అంశాలను డైవర్ట్‌‌ చేయడానికి కొత్త సమస్యను, నిర్ణయాన్ని లేదా వివాదాన్ని తెరపైకి తేవడం కూడా వ్యూహంలో ఉంటుంది. ఇలాంటి వాటి కోసం యూట్యూబ్ సహా సోషల్ మీడియా వేదికల్లో కొంత యాక్టివ్​గా ఉన్నవాళ్లను వందల సంఖ్యలో హైర్ చేసుకుంటున్నారు. నేరుగా పార్టీలకు, లీడర్లకు సహకారం అందించడంతో పాటు హైర్ చేసుకున్నవాళ్లతో ఫేక్ ప్రచారాలు చేయడం స్ట్రాటజీలో భాగంగా చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ, లీడర్ మీద వ్యక్తిగతంగా, రకరకాలుగా కామెంట్లు, సెటైర్లు వేయడం, కొన్నిసార్లు వాళ్ల గురించి తప్పుడు సమాచారాన్ని కూడా ప్రచారం చేస్తుంటారు.  

గెలిపించేది జనమా? స్ట్రాటజీనా?

పొలిటికల్ స్ట్రాటజీ ఆధారంగా సాగుతున్న కొత్త రాజకీయం దారి తప్పుతోందన్న ఆందోళన రాజకీయవేత్తల్లో, మేధావుల్లో మొదలైంది. అడ్డూఅదుపులేని వ్యక్తిగత దాడులు, మార్ఫింగ్ ప్రచారాలు, జనాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించే వివరాలను సర్క్యులేట్ చేయడం ప్రజాస్వామ్యానికే ముప్పుగా మారుతోంది. జనం తాము ఎదుర్కొంటున్న సమస్యలు లేదా తమకు జరిగే మేలు ఆధారంగానే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే పరిస్థితి పోయి, తప్పుడు ప్రచారాల మాయలో పడే ప్రమాదం ఉందంటున్నారు. స్ట్రాటజిస్టుల సాయంతో ఎవరెంత ఖర్చుపెట్టి, ఎంత ఎక్కువగా తప్పుడు ప్రచారాలు చేస్తే వారే గెలుస్తారన్న భావన బలపడితే భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మరోవైపు చరిత్ర గురించి, మహనీయులు, యోధులు, సంఘటనలకు సంబంధించిన వక్రీకరణలు, తప్పుడు ప్రచారాలు మన చరిత్రపై మనకే నమ్మకాన్ని పోగొట్టే ప్రమాదం ఉందంటున్నారు. ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలియని పరిస్థితులు సమాజంలో నైతిక విలువలను, మానవ సంబంధాలను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. 

పార్టీలు జనానికి దూరమయ్యాయా?

రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి లీడర్లు జనంలోనే పనిచేస్తుంటారు. పార్టీలు ప్రజల కోసమే పనిచేస్తుంటాయి. అలాంటి పార్టీలకు తెలియని జనం అవసరాలు, ఆలోచనలు... వాళ్లతో ఏ సంబంధంలేని స్ట్రాటజిస్టులకు ఎలా తెలుస్తాయి? పార్టీలకు లేని వ్యూహాన్ని స్ట్రాటజిస్టులు ఇస్తున్నారంటే బలహీనత పార్టీల్లోనే ఉందన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మారిన పరిస్థితులు, అవసరాలు పొలిటికల్ స్ట్రాటజిస్టులకు డిమాండ్ పెంచినట్లు చెప్తున్నా దీనికి మరోకోణం కూడా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దశాబ్దాలుగా జనం జీవితాల్లో అనుకున్న స్థాయిలో మార్పులు రాకపోవడం, పెరిగిపోతున్న అవినీతి, నిరుద్యోగం లాంటి సమస్యలు రాజకీయ వ్యవస్థపై జనం విశ్వాసాన్ని దెబ్బతీయడమే 
ఈ పరిస్థితికి కారణమని చెప్తున్నారు. ఒక పార్టీ పాలన నచ్చకుంటే మరో పార్టీకి ఓటు వేయడం, రెండో పార్టీ పాలన బాగాలేదని మళ్లీ మొదటి పార్టీకే ఓటేయాల్సి రావడం, ఎవరొచ్చినా సొంత ప్రయోజనాలు తప్ప జనం మేలు పట్టించుకోరన్న భావన పెరిగిపోయింది. 
‘జనం నమ్మకం పోగొట్టుకున్న పరిస్థితుల్లోనే పార్టీలు స్ట్రాటజిస్టులను నమ్ముకుంటున్నాయి. ఏదోలా మాయచేసి, మభ్యపెట్టి గెలిస్తే చాలనుకునే పరిస్థితి వచ్చింది’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనికోసం పోటాపోటీగా, ఏ నియంత్రణ లేని ఎలక్షన్ హామీలనూ పార్టీలు తెరపైకి తెస్తున్నాయి. ఈ పోకడ కూడా వ్యవస్థలను కుప్పకూల్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు స్ట్రాటజిస్టుల ఐడియాలతో గెలిచే పార్టీలకు సొంత ఉనికి, బలం ఏముంటుందన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. జనం ఓట్లకు, మాండేట్​కు విలువ లేకుండా పోతుందన్న ఆందోళన ఉంది. మరోవైపు అభ్యర్థుల సెలక్షన్ సహా రాజకీయ పార్టీల యాక్టివిటీలో పూర్తిగా పనిచేసిన పీకే ఇప్పుడు సొంత రాజకీయం చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ఎప్పుడూ జనంలో లేని స్ట్రాటజిస్టులు జనం కోసం పనిచేయాల్సిన పార్టీలకు సలహాలు ఇచ్చి, ఇప్పుడు జనంలోకి పోయి వారి కోసం పనిచేస్తామని చెప్పడమే ఇంతపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పెద్ద ప్రహసనం. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. పనిచేయెచ్చు. కానీ జనంలోనే ఉండి, స్ట్రాటజీలపై ఆధారపడుతున్న పార్టీలు ఏం చేస్తున్నట్లు? అయితే... జనానికి మరింత దగ్గర కావడానికే స్ట్రాటజిస్టుల సాయం తీసుకుంటున్నామని పార్టీల నేతలు చెప్తున్నారు. కొత్త టెక్ వేదికలపై సంప్రదాయ రాజకీయ నేతలకు అంతగా అవగాహన ఉండదు. కాబట్టి యువతకు కనెక్ట్ కావడానికి సహకారం అందించడం తప్ప స్ట్రాటజిస్టుల రోల్ పెద్దగా ఏం ఉంది? అని అడుగుతున్నారు.

బతుకులు మార్చే స్ట్రాటజీ కావాలి

ఎలక్షన్ రాజకీయం గెలుపు కోసమే. దీన్నిఎవరూ కాదనలేరు. కానీ రాజకీయం అంతా గెలుపుకోసం కాకూడదు అంటున్నారు సామాజికవేత్తలు. జనానికి కావాల్సిన విద్య, వైద్యం లాంటి మౌలిక అవసరాలను తీర్చడమే ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీకైనా లక్ష్యం కావాలని సూచిస్తున్నారు. నిజంగా బతుకులు మార్చే పాలనను లేదా ఎజెండాను జనం ముందుంచితే గెలుపు కోసం ఏ స్ట్రాటజీలు అవసరం లేదంటున్నారు. మారిన ట్రెండ్​లోనే జనం ఆలోచనలు కూడా మారినప్పుడే ఇట్లాంటి పోకడలకు చెక్ పడుతుంది. ఏ సమాచారాన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా, సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. టెక్నాలజీని, సోషల్‌‌ వేదికలను అందిపుచ్చుకుంటున్న జనం వాటిలో నిజానిజాలను తెలుసుకునే అవగాహన పెంచుకోవడం అనవసరమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

మొదటి పొలిటికల్ కన్సల్టెంట్

చరిత్ర మాట అలా ఉంచితే ఆధునిక కాలంలో 19వ శతాబ్దంలోనే రాజకీయ సలహాదారు అనే ఆలోచన మొదలైందని చెప్తారు. 1898లో అమెరికా ప్రెసిడెంట్ విలియం మెక్ కిన్లేకు నాటి వ్యాపారవేత్త, సెనేటర్ కూడా అయిన మార్క్ హన్నా రాజకీయ సలహాదారుగా ఉండేవాడు. మెక్ కిన్లేకు మంచి మిత్రుడు అయిన హన్నా ఆయన్ను నిలబెట్టడానికి సలహాలివ్వడంతో పాటు రాజకీయ ప్రచారానికి తన సొంత డబ్బు ఖర్చుచేశాడు. దీంతో అనధికారికంగా మొదటి పొలిటికల్ కన్సల్టెంట్​గా చెప్పుకుంటారు. ఆ తర్వాత 1930ల్లో పొలిటికల్ కన్సల్టెన్సీ కోసం మొదటిసారి ఓ కంపెనీనే పుట్టుకొచ్చింది. క్లెమ్ విటేకర్, లియోనీ బ్యాక్స్ టర్ అనే భార్యాభర్తలు కాలిఫోర్నియాలో ‘క్యాంపెయిన్స్ ఇన్ కార్పొరేషన్’ పేరుతో రాజకీయ ప్రచారాలకు సహకారం అందించే సంస్థను మొదలుపెట్టారు. 1960ల్లో టీవీ అడ్వర్టైజ్​మెంట్ రంగం బాగా విస్తరించడంతో రాజకీయ ప్రచారం కొత్త రూపం తీసుకుంది. మొదటిసారి పొలిటికల్ కన్సల్టెంట్ అనే పేరుతో పనిచేసినవాడు జోసెఫ్ నపోలిటన్.

అమెరికాలోను, విదేశాల్లో కూడా100కు పైగా పొలిటికల్ క్యాంపెయిన్లకు నపోలిటన్ పనిచేశాడు. 1960లో అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీపడుతున్న జాన్. ఎఫ్. కెనడీకి పనిచేయడంతో నపోలిటన్​కు మంచి గుర్తింపు వచ్చింది. పొలిటికల్ కన్సల్టెంట్​గా ఒకే టైంలో వేరువేరు క్యాంపెయిన్లకు పనిచేయడం కూడా అతనితోనే మొదలైంది. దీన్ని ఒక ప్రొఫెషన్​గా మార్చి ‘అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పొలిటికల్ కన్సల్టెంట్స్’ను ఏర్పాటుచేశాడు. నపోలిటన్ ‘‘అమెరికాలో కొత్త ట్రెండ్. ప్రొఫెషనల్ క్యాంపెయిన్ మేనేజర్’’ అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అప్పట్లో రాసింది.

ఇదొక మార్కెటింగ్ ట్రెండ్ 

స్ట్రాటజిస్ట్​లు, స్ట్రాటజీలు అన్నీ మార్కెటింగ్ ట్రెండ్​లో భాగంగా వచ్చినవే. స్ట్రాటజిస్ట్​ల్లో ఎక్కువ మంది మార్కెటింగ్ ఫీల్డ్ నుంచి వచ్చినవాళ్లే. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? ఏ విషయాల్లో అసంతృప్తితో ఉన్నారు? ఏం చెప్తే వింటారు? అనే ఫీడ్ బ్యాక్​ ఇచ్చేందుకు పని చేస్తున్నాయి స్ట్రాటజిస్ట్​ గ్రూప్​లు. ఏ మాటలకు ప్రజల నుంచి స్పందన బాగుంది? ఏ నినాదానికి ప్రజలు అట్రాక్ట్ అవుతారు? నాయకులు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి? అనే సూచనలు కూడా వాళ్లే ఇస్తున్నారు. గతంలో నమ్మకమైన పార్టీ కార్యకర్తలే ఈ పని చేసేవాళ్లు. కానీ స్ట్రాటజిస్ట్​లు వచ్చాక పార్టీ యంత్రాంగానికి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఏ స్ట్రాటజీతో వెళ్తే గెలుస్తామనే ధ్యాస తప్ప.. ప్రజలకు మంచి చేసే రాజకీయాలు చేద్దామనే అంశం చర్చలో ఉండట్లేదు. వేసే ఎత్తుగడ మంచిదో కాదో అనేది స్ట్రాటజిస్ట్​లకు అవసరం లేదు. ఇందులో నైతికతకు స్థానం లేదు. 
- ప్రొఫెసర్ కోదండరాం, అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి 

అంతరం పూడ్చడానికే స్ట్రాటజిస్టులు

క్షేత్రస్థాయిలో పరిస్థితిపై రాజకీయ పార్టీలకు సరైన సమాచారం అందడం లేదు. మీడియా పైన పెద్దగా ఆధారపడదలుచుకోలేదు. పైగా ఫేక్​ న్యూస్​ విస్తృతంగా వ్యాప్తిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో సరైన, నిర్దిష్టమైన సమాచారం కోసం స్ట్రాటజిస్టుల అవసరం రాజకీయ పార్టీలకు ఏర్పడింది. స్ట్రాటజిస్టులు కూడా నిర్మొహమాటంగా క్షేత్రస్థాయిలో పార్టీ, ఎంపీ, ఎమ్మెల్యేల పరిస్థితిపై సమాచారం ఇస్తుండటంతో వారిపై విశ్వసనీయత పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే తప్ప.. స్ట్రాటజిస్టుల అంచనాలు సఫలీకృతం కావడమూ ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు నియోజకవర్గ ప్రజల డిమాండ్లను నెరవేర్చే స్థితిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు. చాలామంది స్వలాభానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రజలకు ఆయా రాజకీయ పార్టీలు, నేతల మధ్య అంతరం ఏర్పడుతోంది. ఈ అంతరాన్ని  పూడ్చడానికి కూడా వ్యూహకర్తల అవసరం పార్టీలకు ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు ప్రజలపై విశ్వాసం పోయింది. ప్రజలకు రాజకీయ నాయకులపైన అసలు నమ్మకమే లేదు. దీంతోనే రోజు రోజుకూ స్ట్రాటజిస్టులపై రాజకీయ పార్టీలు ఆధారపడటం పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రజలు అర్ధ చైతన్యంలో ఉన్నారు. మరో దశాబ్దకాలం ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు రావచ్చు.
- ప్రొఫెసర్​ హరగోపాల్​

ప్రజలకు, నాయకులకు మధ్య గ్యాప్ పెరిగింది 

రాజకీయాలు చాలా కాస్ట్​లీ అయ్యాయి. ఎమ్మెల్యే కావాలంటే 50 కోట్లు, ఎంపీ కావాలంటే 150 కోట్లు ఖర్చు పెట్టాలి. అధికారంలో ఉన్నవాళ్లు తప్ప, ఇతర పార్టీల నాయకులు ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నవాళ్ల దగ్గర అధికార యంత్రాంగం ఉంటుంది. అంతేకాకుండా రెగ్యులర్​​గా ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు నిరంతరం జనాల్లోకి వెళ్తుంటారు. జనాల్ని, స్థానిక నాయకులను ఒక చోట చేర్చడానికి ఎంతో కొంత ఖర్చుపెట్టాల్సిందే. రూరల్ ఏరియాల్లో తప్ప, అర్బన్ ఏరియాల్లో అయితే ప్రజలకు, వేర్వేరు పార్టీల నాయకులకు అసలు సంబంధం ఉండదు. అందువల్ల ప్రజలకు, నాయకులకు మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో నాయకులంతా సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. అందుకే ఈ మీడియాను మేనేజ్ చేసేందుకు సెఫాలజిస్ట్​లు, స్ట్రాటజిస్ట్​లు లేదా సోషల్ మీడియా ఇంఛార్జీలను పెట్టుకుంటున్నారు. దీని ద్వారానే ప్రత్యర్థుల తప్పులను ఎత్తి చూపడం, ప్రజలతో మాట్లాడటం జరుగుతోంది. దీనివల్లే కొన్ని పార్టీలు స్ట్రాటజిస్ట్​లను నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
- కపిలవాయి దిలీప్ కుమార్, బీజేపీ నేత 

మోడీ టు మ్యాగీ... తెరవెనుక APCO 

మనదేశంలో APCO అనే పేరు తెలిసినవాళ్లు చాలా తక్కువ. కానీ ప్రపంచ వ్యాప్తంగా, మనదేశంలోనూ జరిగిన చాలా పరిణామాల వెనుక APCO స్ట్రాటజీ ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్, స్ట్రాటజిక్ కన్సల్టెన్సీగా ఏర్పాటైన ఈ కంపెనీ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తోంది. వాషింగ్టన్‌‌లో లా కంపెనీగా ఉన్న ఆర్నాల్ట్‌‌ అండ్‌‌ పోర్టర్‌‌‌‌కు చెందిన సబ్సిడరీ సంస్థ APCO. ఆర్నాల్ట్, పోర్టర్‌‌‌‌ పేర్ల నుంచే APCO అనే పేరొచ్చింది.  తర్వాత ఇది ఇండిపెండెంట్‌‌ కంపెనీగా మారింది. ఇది 35కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మాజీ ప్రభుత్వ అధికారులు, నాయకులు, రిటైర్డ్ అంబాసిడర్లు లాంటివాళ్లు APCOలో పనిచేస్తున్నారు. దీనికి ప్రపంచంలోనే శక్తిమంతమైన పీఆర్ ఏజెన్సీగా పేరుంది. ప్రపంచ వ్యాప్తంగా బడా కార్పొరేట్ కంపెనీలు, దేశాధినేతలు, పవర్ ఫుల్ వ్యక్తులు ఏ వివాదంలో చిక్కుకున్నా బయటపడేయడంలో APCO కీలకంగా పనిచేస్తోంది.
అమెరికన్ ఫార్మా దిగ్గజం మెర్క్ తయారుచేసిన వయాక్స్ మెడిసిన్ పై వివాదం తలెత్తడంతో దాన్ని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవడం, తర్వాత వివాదాన్ని చల్లార్చడం వెనుక పనిచేసింది APCOనే. గతంలో కజకిస్తాన్​ ప్రెసిడెంట్​కి తలనొప్పిగా మారిన వ్యక్తిగత వివాదం నుంచి బయటపడేయడానికి APCOని హైర్ చేసుకున్నాడు. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఇమేజ్ పెంచడంలో, పెట్టుబడుల హబ్​గా గుజరాత్​ను ప్రమోట్ చేయడంలోనూ APCOనే కీలకపాత్ర పోషించింది. గుజరాత్ లో 2002లో సబర్మతి ఎక్స్ ప్రెస్ దహనం, తర్వాత గోద్రా మతకలహాల కారణంగా పెట్టుబడుల విషయంలో ఆ రాష్ట్రం ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో నాటి సీఎం మోడీ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో పెట్టుబడులు పెరిగి, తర్వాత కాలంలో అభివృద్ధికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకుంది. వైబ్రెంట్ గుజరాత్ పేరును బ్రాండింగ్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ప్రమోట్ చేయడం ద్వారా దాన్ని సక్సెస్ చేసింది APCO. మోడీ నాయకత్వంలో గుజరాత్​కు వచ్చిన ఈ గుర్తింపే తర్వాత కాలంలో ఆయన్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చింది. 

2015లో మనదేశంలో నెస్లే కంపెనీ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఈ కంపెనీ బ్రాండ్ అయిన మ్యాగీ నూడుల్స్ ఆరోగ్యానికి మంచిది కాదంటూ రిపోర్ట్ రావడంతో ఓవైపు నిషేధాలు, మరోవైపు కంపెనీ ప్రతిష్టకు మచ్చ పడింది. దీంతో APCO సాయం తీసుకుందని చెప్తారు. వివాదంపై నెస్లే కంపెనీ బహిరంగ ప్రకటన చేయడం, నిషేధాలు ఎత్తేయడం, నెస్లే ఇండియా హెడ్​గా విదేశీ అధికారి బదులు భారతీయుడిని నియమించడం, మ్యాగీని రీబ్రాండింగ్ చేయడం ఇటువంటి అన్ని నిర్ణయాల వెనుకా APCO స్ట్రాటజీనే ఉంది. 

పాతకొత్త పొలిటికల్ స్ట్రాటజిస్టులు

శకుని: మహాభారతంలో కీలకంగా కనిపించే పాత్ర శకుని. దుర్యోధనుడికి రాజ్యం దక్కేలా చేయడమే లక్ష్యంగా రకరకాల వ్యూహాలు వేస్తాడు. కుతంత్రానికి మారుపేరుగా కనిపించే శకుని వ్యూహాలు చాలావరకు ఫలిస్తాయి. అయితే అవే వ్యూహాలు చివరికి యుద్ధానికి దారితీసి సర్వనాశనానికి కారణమవుతాయి.
కృష్ణుడు: మహాభారతంలోనే పాండవుల తరపున వ్యూహకర్తగా కృష్ణుడు కనిపిస్తాడు. యుద్ధవ్యూహాల నుంచి రాజనీతి వరకు అన్నింట్లోనూ సలహాదారుడిగా ఉంటాడు. యుద్ధం జరగకుండా రాయబారం నుంచి కురుక్షేత్రంలో యుద్ధం చేయకుండానే వ్యూహాలతోనే పాండవులను గెలిపిస్తాడు.
చాణక్యుడు: మన చరిత్రలోనే గొప్ప వ్యూహకర్త చాణక్యుడు. కౌటిల్యుడిగా మరో పేరున్న చాణక్యుడు రాజనీతివేత్త. తన వ్యూహాలతో చంద్రగుప్తుడిని మగధ చక్రవర్తిగా నిలబెట్టడంతోపాటు అతనికి సలహాదారుగా పాలనలో కీలకపాత్ర పోషించాడు. చాణక్యుడి గ్రంథం అర్థశాస్త్రం ఇప్పటికీ గొప్ప రాజనీతి గ్రంథంగా నిలిచింది.

ప్రశాంత్ కిశోర్ (పీకే-): డేటానే ఆయుధంగా ఎలక్షన్ వ్యూహాలను మలచిన కొత్తతరం క్యాంపెయిన్ ప్లానర్‌‌‌‌ పీకే. 2014లో కేంద్రంలో మోడీ, 2015, 2020లో బీహార్ లో నీతిశ్ కుమార్, 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్, 2021లో తమిళనాడులో స్టాలిన్ గెలుపు వెనుక పీకే వ్యూహాలున్నాయి. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) పేరుతో ఆయన సొంత కన్సల్టెన్సీ టీమ్ నడుపుతున్నాడు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు పనిచేస్తున్నాడు. మరోవైపు ఇటీవలే కాంగ్రెస్​లో చేరాలని భావించి డ్రాప్ అయిన పీకే బీహార్​లో సొంత వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి రాజకీయాలు కాకుండా పాదయాత్ర చేసి, తర్వాతే పాలిటిక్స్ పై క్లారిటీ ఇస్తానని ప్రకటించారు. 
సునీల్ కనుగోలు: పీకేతో మొదటి నుంచి కలిసి పనిచేసిన సునీల్ కనుగోలుకు సొంతంగా మైండ్ షేర్ అనలిటిక్స్ అనే  కన్సల్టెన్సీ ఉంది. 2015లో ఐ-ప్యాక్ నుంచి బయటికొచ్చిన సునీల్ సొంతంగా పనిచేయడం మొదలుపెట్టాడు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, పంజాబ్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో పార్టీకి స్ట్రాటజిస్ట్​గా పనిచేసిన అనుభవంతో ఇప్పుడు కాంగ్రెస్​లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కొన్ని నెలలుగా తెలంగాణ కాంగ్రెస్ కోసం వ్యూహాలు రూపొందించే పనిలో ఉన్నాడు. జాతీయ కాంగ్రెస్​లో సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలో సభ్యుడిగా కూడా సునీల్​ను తీసుకున్నారు. ముందుగా... వచ్చే ఏడాది కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్ కోసం స్ట్రాటజీని అమలు చేస్తున్నారు.
సౌరభ్ వ్యాస్, గౌరవ్ రాథోడ్: ఐఐటీలో ఇంజినీరింగ్ డిగ్రీలు చేసిన సౌరభ్, గౌరవ్ 2014లో  ‘పొలిటికల్ ఎడ్జ్’ పేరుతో కన్సల్టెన్సీ మొదలుపెట్టారు. టెక్, డేటా అనాలసిస్ సేవలను పలు పార్టీలకు, లీడర్లకు అందిస్తున్నారు. వీళ్ల క్లయింట్లలో సచిన్ పైలట్, శశిథరూర్, మిలింద్ దేవరా, దేవెగౌడ్ లాంటివాళ్లున్నారు.

పార్థ దాస్: బెంగళూరుకు చెందిన దాస్, అరిందం మన్నాతో కలిసి 2013లో ‘చాణక్య’ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. క్రమంగా లీడర్లను రీచ్ అవుతున్నాడు. బీహార్ లో తేజస్వి యాదవ్ కు పనిచేసిన దాస్ కర్ణాటకలోనూ కొందరు లీడర్లకు క్యాంపెయిన్ లో సహకారం అందించాడు. 
సందీప్ పాఠక్: ఆప్ అధినేత కేజ్రివాల్ కు సన్నిహితుడైన పాఠక్ పంజాబ్ లో పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. చత్తీస్ గఢ్ కు చెందిన ఆయన ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ గా పనిచేశాడు. పంజాబ్​లో గెలిచినందుకు కానుకగా రాజ్యసభకు పంపిన కేజ్రివాల్ ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని నిర్మించే పనిని అప్పగించాడు.

పీవీ నరసింహారావు: కాంగ్రెస్ పాలనలో రకరకాల పదవుల్లో తెరవెనుక కీలకపాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు 1991లో దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. కాంగ్రెస్​కు పూర్తి మెజారిటీ లేకపోయినా ఐదేండ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించడమే ఆయన ప్రత్యేకత. అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న పీవీ రాజకీయ వ్యూహాలతో ప్రభుత్వాన్ని నిలబెట్టడమే కాకుండా ఆర్థికంగా దెబ్బతిన్న దేశాన్ని సంస్కరణలతో ముందుకు నడిపించారు. దేశ చరిత్రనే మలుపు తిప్పిన సంస్కరణలతో ఆధునిక భారతదేశానికి పునాదులు వేశారు. 

ప్రమోద్ మహాజన్, సుధాంశు మిత్తల్: మనదేశంలో పొలిటికల్ స్ట్రాటజీల్లో కొత్త ట్రెండ్ కు తెరతీసినవాళ్లు. బీజేపీలో యువనేత అయినప్పటికీ ప్రమోద్‌‌ మహాజన్‌‌ పార్టీ వ్యూహాల్లో కీలకపాత్ర పోషించారు. 2004లో వాజ్ పేయి పాలన గురించి ‘ఇండియా షైనింగ్’ పేరుతో విస్తృతంగా నడిచిన క్యాంపెయిన్ అప్పటివరకు సాగిన ప్రచారానికి భిన్నంగా సాగింది. దేశంలో ప్రతి ఇంటినీ, ఓటర్ ని తాకేలా అన్ని రకాల మీడియా వేదికలతో సాగిన ప్రచారం తర్వాత కాలంలో ఎలక్షన్ క్యాంపెయిన్ తీరును పూర్తిగా మార్చేసింది. నాటి ప్రచారం ఎన్నికల్లో గెలుపు అందించలేకపోయినా ప్రచార రంగాన్ని మాత్రం కొత్త పుంతలు తొక్కించింది.

అరుణ్ జైట్లీ: బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న లీడర్. పార్టీకిగానీ, వాజ్ పేయి హయాంలో పాలనలో ఏ సమస్య వచ్చినా ఆయనే రంగంలోకి దిగేవారు. రాష్ట్రాల్లోనూ పార్టీ పరంగా ఏ ఇష్యూ వచ్చినా నాయకత్వం జైట్లీనే పంపించేది. ఇంఛార్జిగా బీజేపీలో గెలుపు వ్యూహాలు రూపొందించి చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు.

అహ్మద్ పటేల్: సోనియాగాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక ఆమెకు రాజకీయ సలహాదారుగా కీలక పాత్రపోషించిన స్ట్రాటజిస్ట్ అహ్మద్ పటేల్. పబ్లిక్ లో ఎక్కడా కనిపించకుండానే తెరవెనుకే పనులన్నీ చక్కబెట్టడంలో దిట్టగా ఆయనకు మంచి పేరుంది. 

జైరామ్ రమేశ్: కాంగ్రెస్​లో ట్రబుల్ షూటర్​గా, మేధావిగా పేరున్న లీడర్. 

ఎలాగైనా గెలవడమే లక్ష్యం 

పూర్వకాలంలో చాణక్యుడిలాగే ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్​లు. ఎత్తుకు పై ఎత్తు వేయడం, వ్యూహానికి ప్రతివ్యూహాన్ని అల్లడం, మాటకు మాటను తూటాల్లా వదలడంలాంటి పనులన్నీ రాజకీయ నాయకులతో చేయించేది వీళ్లే. తెర వెనక సూత్రధారులు స్ట్రాటజిస్ట్​లే. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులకు నమ్మకమైన క్యాడర్ తక్కువైపోయింది. కోవర్ట్ రాజకీయాలు పెరిగిపోయాయి. అందుకే పార్టీలు స్ట్రాటజిస్ట్​లను నమ్ముకుంటున్నాయి. ఎలక్షన్స్ టైంలో సోషల్ మీడియా కేంద్రంగా కొన్ని ఎమోషన్స్​ను రెచ్చగొట్టి,  ప్రజలను ఆయా పార్టీల వైపు మళ్లేలా చేయడమే పనిగా పెట్టుకున్నారు.  ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో, అందులో మంచీచెడులను పట్టించుకోవట్లేదు స్ట్రాటజిస్ట్​లు.
- ప్రొఫెసర్ తౌటం శ్రీనివాస్, డీన్, సోషల్ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ

ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్ట్రాటజిస్టులు

సన్ ట్సు: క్రీస్తు పూర్వం చైనాకు చెందిన సన్ ట్సు గొప్ప మిలిటరీ స్ట్రాటజిస్ట్ గా చరిత్రకెక్కాడు. అతని గ్రంథం ఆర్ట్ ఆఫ్ వార్ ఇప్పటికీ బెస్ట్ సెల్లర్ గా ఆదరణ పొందింది. 

కార్ల్ వాన్ క్లాజ్ విట్జ్: 18, 19 శతాబ్దాలకు చెందిన ప్రష్యా మిలిటరీ స్ట్రాటజిస్ట్. నెపోలియన్ యుద్ధాల ఆధారంగా ఆయన ద వార్ అనే గ్రంథం రాశారు.

నెపోలియన్ బోనపార్టే: ఫ్రెంచ్ రాజుగా చరిత్రకెక్కిన నెపోలియన్ యుద్ధవీరుడు. ఫ్రెంచ్ విప్లవం తర్వాత పాలకుడిగా ఎదిగిన నెపోలియన్ తన వ్యూహాలతో తిరుగులేని విజయాలు సాధించాడు. తక్కువ వనరులతోనే గెలుపు సాధించడం అతని ప్రత్యేకత. 

నికోలో మాకియవెల్లి: ఇటలీకి చెందిన రాజకీయవేత్త మాకియవెల్లి ద ప్రిన్స్ అనే రాజనీతి గ్రంథంతో చరిత్రకెక్కాడు. పాలనలో, యుద్ధాల్లో రాజులు అనుసరించాల్సిన సూత్రాలను వివరంగా రాశాడు. అయితే ఇతని ఆలోచనలను అప్పటి రాజులు పట్టించుకున్నట్లుగా కనిపించదు. తన రచనతో పొలిటికల్ ఫిలాసఫీ ఒక శాస్త్రంగా మారడంలో కీలకపాత్ర పోషించాడు.

విన్ స్టన్ చర్చిల్: బ్రిటన్ ప్రధానిగా, స్టేట్స్ మన్ గా పేరున్న చర్చిల్ యుద్ధ వ్యూహకర్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలుపు ఆయన విజయంగా చెప్పుకుంటారు. అయితే చర్చిల్ నిర్ణయాలు చాలా సందర్భాల్లో బ్రిటన్ కు నష్టం చేశాయి. వరల్డ్ వార్ గెలిచామని చెప్పుకున్నా తర్వాత జరిగిన ఎలక్షన్లలో చర్చిల్ ఓడిపోయాడు.

రకరకాల స్ట్రాటజీలు

చరిత్రలో స్ట్రాటజీ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది యుద్ధతంత్రాలే. యుద్ధ నియమాలు పాటిస్తూనే గెలుపుకోసం సైనికుల మోహరింపులో కొత్త ఆలోచనలు చేసేవాళ్లు. యుద్ధతంత్రాలు తెలిసిన సైన్యాధిపతులు, కొంతమంది రాజులు కూడా వార్ స్ట్రాటజీలు చేసేవారని చెప్తారు. యుద్ధవిద్యల్లో భాగంగానే ఇట్లాంటివి గురువులు నేర్పించేవాళ్లు. తర్వాత రాజ్యాలు, రాజరికాలు నడిచిన కాలంలో మంత్రులు, రాజగురువులు లాంటివాళ్లు కీలకంగా ఉండి, పరిపాలనలో సలహాలు ఇచ్చేవాళ్లు. 19 శతాబ్దం వరకు స్ట్రాటజీ అంటే అందరికీ తెలిసింది ఇవే. మోడర్న్ యుగంలో మాత్రం స్ట్రాటజీల అవసరం లక్ష్యం మారిపోయింది. 

ఇప్పుడు ప్రతిదానికీ స్ట్రాటజీ అనే పదం వాడుతున్నప్పటికీ కీలకంగా, ఆర్గనైజ్డ్​గా పనిచేస్తున్న రంగాలు కొన్నే ఉన్నాయి. బిజినెస్ రంగంలో కంపెనీలను ప్రమోట్ చేయడం, కొత్త ప్రొడక్ట్​లను బ్రాండింగ్ చేయడం, సేల్స్ పెంచడంలాంటి వాటితో పాటు పర్మిషన్లు, లైసెన్సుల కోసం తెరవెనుక లాబీలు చేయడం కూడా స్ట్రాటజీల్లో భాగంగా మారింది. అమెరికా లాంటి దేశాల్లో లాబీయింగ్ బహిరంగంగానే జరుగుతుంది. లాబీయింగ్​ను గుర్తించని దేశాల్లో కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేయడానికి కూడా స్ట్రాటజీలు చేస్తుంటారు. 
ఇక అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా నడిచే స్ట్రాటజీలు మరోరకం. చిన్న దేశాలను తమకు అనుకూలంగా మలచుకోవడానికి పెద్ద దేశాలు వీటిని అమలుచేస్తుంటాయి. ఇందుకోసం కొన్ని కన్సల్టెన్సీలు పనిచేస్తుంటాయి. కార్పొరేట్ కన్సల్టెన్సీ ఏజెంట్లలా వ్యవహరిస్తూ పెద్ద దేశాలకు అనుకూల నిర్ణయాల కోసం చిన్న దేశాల అధినేతలు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు పనిచేసేలా ఒప్పించడానికి వీళ్లు పనిచేస్తుంటారు. ఇక మూడోరకం స్ట్రాటజీ ఇప్పుడు అన్ని పార్టీలకూ అవసరంగా మారిన పొలిటికల్ క్యాంపెయినింగ్. చాలా అంతర్జాతీయ కన్సల్టెన్సీలు.. కార్పొరేట్, ఇంటర్నేషనల్, పొలిటికల్... అంటూ అన్నిరకాల స్ట్రాటజీలకు పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా ఎకనమిక్, డిజైన్, బ్యాంకింగ్ లాంటి రంగాల వారీగా చాలా రకాల స్ట్రాటజీలు ఉన్నాయి. ... మురళీ కృష్ణ.కె