ఇబ్రహీం, ప్రశాంత్కు ముందే పరిచయం.. పోచారం కాల్పుల ఘటనపై సీపీ

ఇబ్రహీం, ప్రశాంత్కు ముందే పరిచయం.. పోచారం కాల్పుల ఘటనపై సీపీ

పోచారం కాల్పుల ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు సీపీ సుధీర్ బాబు. బుధవారం (అక్టోబర్ 22) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇబ్రహీం అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో గాయపడిన ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో ప్రశాంత్ చికిత్స పొందుతున్నట్లు సీపీ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఇబ్రహీం, ప్రశాంత్ ఇద్దరికీ ముందే పరిచయం ఉన్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడు ఇబ్రహీంపై గతంలో గోవులను తరలిస్తున్న క్రమంలో శంషాబాద్ లో 2, కల్వకుర్తి ఒక కేసులు నమోదు అయ్యాయని అన్నారు. తనపై కేసులు నమోదు కావడానికి ప్రశాంత్ కుమార్ కారణంగా భావించిన ఇబ్రహీం.. దాడికి దిగినట్లు తెలుస్తుందని అన్నారు. 

ఇబ్రహీం, ప్రశాంత్ కుమార్ మధ్య గత కొద్ది నెలల నుంచి పరిచయం ఉంది. ప్రశాంత్ కుమార్ తో మాట్లాడడానికి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ఫోన్ చేసి పోచారం పిలిపించుకున్నాడు ఇబ్రహీం. మాట మాట పెరగడంతో  ఇబ్రహీం అండ్ గ్యాంగ్ ప్రశాంత్ పై గన్ తో ఫైర్ చేసింది.. అని సీపీ సుధీర్ బాబు తెలిపారు. 

►ALSO READ | ఖమ్మంలో వింత పాము.. దేహంపై రెండు రకాల గుర్తులు.. ఇలాంటి పామును చూడలేదంటున్న స్నేక్ క్యాచర్స్

బుధవారం (అక్టోబర్ 22) జరిగిన కాల్పుల కేసులో మొహమ్మద్ ఇబ్రహీం కురేశి, హనీఫ్ కురేశి, కురువ శ్రీనివాస్, హస్సంబిన్ మోసిన్ లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల్లో హనీఫ్ కురేషి పరారిలో ఉన్నాడని తెలిపారు. 

 ఇబ్రహీం తన మిత్రుడి సహకారంతో ఛత్తీస్ గఢ్  నుంచి గన్ కొనుగోలు చేసాడు.. ఈ ఘటనలో అందరూ మిత్రులే అనేందుకు ఆధారాలు ఉండడంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం.. గాయపడిన ప్రశాంత్ కుమార్ కోలుకున్న అనంతరం మరింత లోతుగా కేసు దర్యాప్తు ముందుకు సాగుతుంది.. అని సీపీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.