- వనమా హరిప్రియలకు మళ్లీ చాన్స్
- పొంగులేటి వర్గం నుంచి బీఆర్ఎస్లోకి తిరిగొచ్చిన తెల్లంకు గులాబీ టికెట్
- గుమ్మడి అనురాధకు దక్కని అవకాశం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీఆర్ఎస్లో అసెంబ్లీ టికెట్ల ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు పాత కాపులకే పట్టం కట్టారు. దీంతో బీఆర్ఎస్ టికెట్ వచ్చిన క్యాండిడేట్లు సంబురాలు చేసుకుంటున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ అభ్యర్థిత్వంపై చివరి క్షణం వరకు సస్పెన్స్ కొనసాగినా టికెట్ దక్కింది. కొత్తగూడెం టికెట్ ఆశించిన స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుకు గులాబీ ముండ్లు గుచ్చుకున్నాయి. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత గుమ్మడి నర్సయ్య కూతురు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధకే టికెట్ అంటూ వారం రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. చివరకు ఊసూరుమనిపించారు.
పాత కాపులకే పట్టం..
జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలకు పాత కాపులకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టం కట్టారు. ఇల్లెందు నుంచి ఎమ్మెల్యే భానోత్ హరిప్రియకు, కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు, పినపాక నుంచి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు, అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు, భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరుపున గతంలో పోటీ చేసి ఓడి పోయిన తెల్లం వెంకట్రావ్‌కు కేసీఆర్ టికెట్లను కేటాయించారు.
కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావుతో పాటు టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కొద్ది రోజులకే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి ప్రస్తుతం కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. ఇల్లెందు నుంచి హరిప్రియకు టికెట్ ఇవ్వవద్దంటూ మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. హరిప్రియ భర్త హరిసింగ్ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందంటూ ఆరోపించారు. అయినా చివరకు ఆమెకే టికెట్ దక్కడంతో వారిలో తీవ్ర నిరాశ నెలకొంది.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం సీటును దక్కించుకునేందుకు నానా పాట్లు పడ్డారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలు ఆరోపణలున్న క్రమంలో టికెట్‌పై కొంత సందిగ్ధత నెలకొంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలైన తెల్లం వెంకట్రావ్ ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. వెంకట్రావ్ తిరిగి నాలుగు రోజుల కిందట బీఆర్ఎస్లో చేరారు. భద్రాచలం టికెట్‌ను కేసీఆర్ ఆయనకే కన్ఫర్మ్ చేశారు.
అనురాధకు దక్కని చోటు
మాజీ ఎమ్మెల్యే, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య కూతురు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు టికెట్ ఆఫర్ చేశారు. మొదట ఒప్పుకోకున్నా చివరకు ప్రజా సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. చివరకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే బీఆర్ఎస్ జాబితాలో అనురాధ పేరు లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు కొంత విస్మయానికి గురయ్యారు. న్యూడెమోక్రసీ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు తీరుపై గుస్సాగా ఉన్నారు.
గడలకు నిరాశ
కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు పేరునే తిరిగి ప్రకటించడంతో స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా గడల విస్తృతంగా పర్యటిస్తున్నారు. జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లారు. ఎమ్మెల్యే వనమాపై తీవ్ర రాజకీయ ఆరోపణలు చేశారు.
వైరాలో రాములు నాయక్ ఔట్..!
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ టికెట్లపై ఊహాగానాలకు తెరపడింది. ఖమ్మంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి కారు గుర్తుపై పోటీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచింది అజయ్ ఒక్కరే. వరుసగా రెండు సార్లు ఖమ్మం నుంచి గెలిచి, ఈసారి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. పాలేరులో గత ఎన్నికల్లో కాంగ్రెస్తరపున గెలిచి, తర్వాత టీఆర్ఎస్ లో చేరిన కందాళ ఉపేందర్ రెడ్డికి మళ్లీ అవకాశం దక్కింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, సిట్టింగ్ కే కేసీఆర్ ఓటేశారు. మధిరలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిన లింగాల కమల్ రాజుకు మళ్లీ ఛాన్సిచ్చారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం జడ్పీ చైర్మన్ గా ఉన్నారు.
వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ కు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరినా ఇప్పుడు టికెట్ నిరాకరించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు అవకాశమిచ్చారు. సత్తుపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టికెట్ దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. మధిర టికెట్ దక్కించుకున్న కమల్ రాజు, తన భార్యతో కలిసి మంత్రి పువ్వాడను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు చాలా చోట్ల అభ్యర్థులు ఒకరే అయినా, పార్టీ గుర్తు మారడం ఇంట్రస్టింగ్ పాయింట్. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, రెండు చోట్ల టీడీపీ, ఒక చోట టీఆర్ఎస్, ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఎన్నికల తర్వాత నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా, ప్రస్తుతం వాళ్లంతా బీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నారు.