
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జనన, మరణ రికార్డులను ఓటర్ల లిస్ట్‌ను లింక్ చేయనున్నట్టు తెలిపింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని చెప్పింది. దీంతో అత్యంత కచ్చితత్వంతో ఓటరు జాబితాను నవీకరించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఈసీ గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. నమోదిత మరణాలకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వో) సకాలంలో పొందే వీలుంటుందని వివరించింది.
చనిపోయిన వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చేంతవరకు వేచి చూడకుండా.. ఆర్జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధ్రువీకరించుకుంటారని వెల్లడించింది. ఎన్నికల నిబంధనలు-1960, జనన, మరణాల నమోదు చట్టం-–1969 ప్రకారం ఈసీకి ఈ సమాచారాన్ని తీసుకునే అధికారం ఉంది.
బీఎల్వోలకు ఐడీ కార్డులుఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్స్ (వీఐఎస్) మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా దాని డిజైన్‌ను మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీరియల్ నంబర్, పార్టు నంబర్ల సైజును పెంచ నున్నట్టు తెలిపింది. తద్వారా ఓటర్లు తమ పోలిం గ్ స్టేషన్లను తేలికగా గుర్తించడంతోపాటు అటు పోలింగ్ అధికారులకు కూడా జాబితాలోని పేర్ల ను సులభంగా సరిచూసుకునే వీలుంటుంది. బూత్ లెవల్ ఆఫీసర్లకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేయనున్నట్టు ఈసీ వెల్లడించింది.