హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో కాకరేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో ఆమె ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. తొలిసారి అన్ని పోలింగ్ ప్రాంతాల్లో ఏరియల్ పర్యవేక్షణ, రియల్ టైమ్ అనాలసిస్ కోసం డ్రోన్ నిఘా పెడ్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను అమల్లోకి తెచ్చారు.
పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ విధించారు. 1,761 మంది స్థానిక పోలీసులతోపాటు 800 మంది సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు.
ఈ ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నాయి. కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాన్ని నమ్ముకోగా, బీఆర్‌ఎస్ సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ మోదీ ప్రభ, హిందుత్వ అజెండానే విశ్వసిస్తున్నది. కాంగ్రెస్ రెండేండ్ల పాలన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్లే 3 ప్రధానపార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.
