చత్తీస్​గఢ్, మిజోరంలో ఇయ్యాల్నే పోలింగ్

చత్తీస్​గఢ్, మిజోరంలో ఇయ్యాల్నే పోలింగ్
  • చత్తీస్ గఢ్​లో 60వేల మంది పోలీసులతో భద్రత
  • 5,304 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఈసీ

రాయ్​పూర్/ఐజ్వాల్ :  ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా మంగళవారం మిజోరం, చత్తీస్ గఢ్​లలో పోలింగ్​ జరగనుంది. రెండు దశలలో జరగనున్న చత్తీస్ గఢ్​ అసెంబ్లీ ఎన్నికలలో మంగళవారం 20 నియోజకవర్గాల్లో జనం ఓటేయనున్నారు. ఈ సీట్లలో 25 మహిళలు సహా మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 40 లక్షల మంది ఓటర్లు ఉండగా అధికారులు 5,304 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

నక్సల్స్ ప్రభావిత బస్తర్ డివిజన్ ల్లోని 600 పోలింగ్ స్టేషన్లలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 40 వేల మంది సెంట్రల్ ఆర్మ్​డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), 20 వేల మంది స్టేట్ పోలీసులను అధికారులు మోహరించారు. యాంటీ నక్సల్ యూనిట్ కోబ్రాతో పాటు మహిళా కమాండోలను కూడా రంగంలోకి దించారు. భద్రతా కారణాల దృష్ట్యా బీజాపూర్, నారాయణపూర్, అంతగఢ్, దంతేవాడ, కొంటా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మొత్తం 149 పోలింగ్ కేంద్రాలను దగ్గరలోని పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌, సెక్యూరిటీ క్యాంపులకు తరలించారు. డ్రోన్లు, హెలీకాప్టర్ల ద్వారా నక్సల్స్ కదలికలపై నిఘా ఉంచనున్నారు. రాష్ట్రంలోని మిగతా 70  అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 17న పోలింగ్​ జరగనుంది.

హెలీకాప్టర్ ద్వారా పోలింగ్ సామాగ్రి తరలింపు

బస్తర్ డివిజన్ లోని 9 సెగ్మెంట్ల​లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, బస్తర్, జగదల్​పూర్, చిత్రకూట్​లో మాత్రం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించనున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న 156కి పైగా పోలింగ్‌‌‌‌‌‌‌‌ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, ఈవీఎంలను హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 196 పోలింగ్ కేంద్రాలు మారగా, 2019 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో 330 బూత్‌‌‌‌‌‌‌‌లను తరలించారు. 2018తో పోలిస్తే.. 126 లొకేషన్స్​లో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 40 పోలింగ్ స్టేషన్లు మిన్పా, గల్​గమ్, సిల్గర్, చందామేటలో ఉన్నాయి. ఏడు జిల్లాల్లోని ప్రతీ ఐదు పోలింగ్ కేంద్రాల్లో మహిళా కమాండోలను మోహరించారు. నారాయణ్​పూర్ జిల్లాలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తను శనివారం హత్య చేశారు. 2018, అక్టోబర్​లో ముగ్గురు పోలీసులు, దూరదర్శన్ కెమెరామెన్ నక్సల్స్ దాడిలో చనిపోయారు. 

మిజోరం బరిలో 174 మంది అభ్యర్థులు

మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్​ జరగనుంది. 8.57లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారు. 1,276 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ నిర్వహిస్తున్నారు. 149 పోలింగ్ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. 30 పోలింగ్ సెంటర్లు ఇంటర్ స్టేట్, ఇంటర్నేషనల్ బార్డర్​ దగ్గర్లో ఉన్నాయి.

వీటిని సెన్సిటివ్ ఏరియాలుగా గుర్తించారు. 510 కిలో మీటర్ల మయన్మార్, 318 కిలో మీటర్ల బంగ్లాదేశ్ బార్డర్ ఉంది. మయన్మార్ బార్డర్ వద్ద అస్సాం రైఫిల్స్ దళాలు, బంగ్లాదేశ్ బార్డర్ వద్ద బీఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. అస్సాం, మణిపూర్, త్రిపురతో మిజోరం సరిహద్దు పంచుకుంటున్నది. ఎన్నికల సందర్భంగా సరిహద్దులన్నీ క్లోజ్ చేశారు. 3వేల మందిని మోహరించారు. అధికార పార్టీ ఎంఎన్ఎఫ్, ప్రతిపక్ష పార్టీ జడ్ పీఎం, కాంగ్రెస్ పార్టీలు 40 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 23 స్థానాల్లో, ఆప్ 4 స్థానాల్లో, 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.