
నిజామాబాద్.. రాష్ట్రంలోనే ఉత్కంఠ రేపుతున్న లోక్ సభ సెగ్మెంట్. 178 మంది రైతులు బరిలో నిలవడం… టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ కవిత… బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి బలమైన నాయకులు పోటీ చేస్తుండటంతో… ఈ సెగ్మెంట్ లో పోలింగ్ సరళి ఎలా జరిగిందన్న దానిపై రాష్ట్రంలోనే కాదు… భారతదేశం అంతటా… చర్చ జరుగుతోంది. దీని ఫలితం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
రాష్ట్రంలో అత్యధిక మంది అభ్యర్ధులు నామినేషన్ వేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ రోజున మాక్ పోలింగ్ ఉదయం ఆరుగంటల కన్నా ముందు నుంచే ప్రారంభమైనా.. ఓట్లు వేసేందుకు మాత్రం చాలా సమయం పట్టింది. కొన్ని చోట్ల ఇదే కారణంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
నామినేషన్లు వేసిన పసుపు, ఎర్రజొన్న రైతులున్న గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో పోలింగ్ ఏజెంట్లను నియమించారు. కమ్మర్ పల్లి, జక్రాన్ పల్లి, ఆర్మూర్, బాల్కొండ మండలాల్లోని పలు పోలింగ్ స్టేషన్లలో వేసిన షామియానాలు ఏజెంట్లతో నిండిపోయాయి.
కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ల కొరత
అన్ని పోలింగ్ బూత్‍లలో బీజేపీ, టీఆర్ఎస్ ఏజెంట్లు కనిపించారు. కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ ఏజెంట్ల కొరత కనిపించింది. కాంగ్రెస్ ఏజెంట్లు లేకుండానే చాలా గ్రామాల్లో పోలింగ్ జరిగింది.
ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
భీమ్‍గల్ మండలం బడాభీమ్‍గల్ గ్రామంలో పోలింగ్ స్టేషన్ నెం.175 లో పోలింగ్ ను దాదాపు 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ ను ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా , గుర్తింపు కార్డుల విషయంలో ఓటర్లను ఇబ్బందులు పెడుతున్నారంటూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పోలింగ్ అధికారిపై మండిపడ్డారు. ఒక దశలో అధికారులకు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు
బోధన్ మండలం చెక్కి క్యాంపు గ్రామంలో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. శ్రీనివాస నగర్ క్యాంప్ పంచాయతీలో శివారు గ్రామంగా ఉన్న చెక్కి క్యాంపును బోధన్ మున్సిపాలిటీలో విలీనం చేయొద్దంటూ గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాస్ నగర్ క్యాంపు బోధన్ మున్సిపాలిటీలో కలిపితే కలపండని, మా చెక్కి క్యాంపును కలపొద్దంటూ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఇదే గ్రామపంచాయతీలో శివారు గ్రామంగా ఉన్న ఆచన్‍పల్లిలో కూడా విలీనానికి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ నాయకులు వచ్చి గ్రామస్థులతో మాట్లాడి విలీనానికి ఒప్పించారు. దాంతో వారు ఎన్నికల్లో పాల్గొన్నారు. చెక్కి క్యాంపు ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఆరు వార్డులు, ఆరువందల ఓట్లున్న గ్రామంలో 70 శాతం ప్రజలు ఉపాధి హామీ కూలీలున్నారు.
మొరాయించిన ఈవీఎంలు
ఇందల్ వాయిలోనూ… గన్నారం గ్రామంలోని నెం.150 పోలింగ్ స్టేషన్, తిర్మన్‍పల్లిలోని నెం. 139 పోలింగ్ స్టేషన్ లో దాదాపు గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
సిరికొండ మండలంలోని మైలారం గ్రామంలోని 260 పోలింగ్ బూత్‍లో గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇదే మండలంలోని రావుట్ల గ్రామంలోని 252, 254 పోలింగ్ బూత్‍లో, చీమన్ పల్లి గ్రామంలోని 283 పోలింగ్ బూత్‍లో ఈవీఎం లు మొరాయించాయి. చాలా సేపటి వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు.
ఇదివరకు జరిగిన ఎన్నికల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమయ్యేది. అదే అలవాటుతో గ్రామాల్లో ప్రజలు 7 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని అదికారులు చెప్పడంతో పోలింగ్ ప్రారంభమయ్యే వరకు అక్కడే కూర్చున్నారు. ఎనిమిదవుతున్నా పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో జనాలు ఎన్నికల సిబ్బందిపై మండిపడ్డారు. చాలా చోట్ల ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోయారు. రాజకీయపార్టీల నాయకులు వారిని ఆపే ప్రయత్నం చేసినా వినకుండా వచ్చిన దోవన ఇళ్లకు వెళ్లిపోయారు.
సదుపాయాలు లేక
శంకర్ భవన్ స్కూల్, పులాంగ్ ఉర్దూమీడియం స్కూల్, పెద్ద బజార్ లోని బడా రాంమందిర్ స్కూల్, రైల్వే స్టేషన్ వెనకనున్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లలో అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు. వృద్ధులు, వికలాంగులకు కూర్చోడానికి బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేయలేదు. నీడ కోసం వేసిన కుర్చీలు సరిపడా వేయలేదు.
ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు నేతలు
- నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామంలో తన భర్త అనిల్ కుమార్, అత్త, మామలతో కలిసి టీఆర్‍ఎస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత క్యూలైన్‍లో నిల్చొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి తన సతీమణితో కలిసి నిజామాబాద్ నగరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- బోధన్ శక్కర్ నగర్ గర్ల్స్ హైస్కూల్ లోని పోలింగ్ బూత్‍లో తన సతీమణి అయేషా ఫాతిమాతో కలిసి తన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌడ్ యాష్కీ నిజామాబాద్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.