కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థుల ఎంపికపై మార్చి 13న అభిప్రాయ సేకరణ

కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థుల ఎంపికపై మార్చి 13న అభిప్రాయ సేకరణ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న 13 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ  బుధవారం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. పెండింగ్ సీట్ల జిల్లాల డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్​చార్జిలతో సమావేశం కానున్నారు. లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందని నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు. వారి అభిప్రాయాలు సేకరించాక ఏఐసీసీకి పంపిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు.

కాగా, బుధవారం రాత్రి సీఈసీ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో.. దీపాదాస్ మున్షీ మీటింగ్ పూర్తి కాగానే నేతల అభిప్రాయాలను ఏఐసీసీకి పంపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా.. నల్గొండ, మహబూబ్​నగర్, మహబూబాబాద్, జహీరాబాద్ అభ్యర్థులను ఈనెల 8న ఏఐసీసీ ప్రకటించింది. మొదటి నుంచీ కాంగ్రెస్ లో ఉన్న వారి పేర్లనే ప్రకటించి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పేర్లను పక్కన పెట్టింది. మొదటి లిస్ట్​లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పేర్లను ప్రకటిస్తే విమర్శలు వస్తాయని నలుగురి పేర్లను మాత్రమే ప్రకటించింది.