ఏడాదైనా మారని చెరువులు.. వరదలపై భయాందోళన

ఏడాదైనా మారని చెరువులు.. వరదలపై భయాందోళన
  • ఏడాదైనా చెరువులు బాగు పడలె
  • వరదలపై గ్రేటర్ జనాల్లో మళ్లీ భయాందోళన  
  • ఇప్పటికీ నియంత్రణ చర్యలు చేపట్టని అధికారులు  
  • రిపేర్లు లేక,  కబ్జాలను తొలగించక పోవడంతో పొంచి ఉన్న ముంపు

గతేడాది కురిసిన భారీ వానలకు వచ్చిన వరదల వల్ల మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని  పల్లె చెరువు సృష్టించిన బీభత్సం  ఇప్పటికీ స్థానికులను కలవర పెడుతోంది. పల్లె చెరువు కట్ట తెంచుకుని ఐదుగురిని బలి తీసుకుంది. వందలాది ఇండ్లను నీట ముంచింది. తాత్కాలిక నివారణ చర్యల్లో భాగంగా కట్టకు రిపేర్లు చేసినా...చెరువులో పూడిక, గుర్రపు డెక్కను తొలగించలేదు. దీంతో ఈసారి భారీ వానలు పడితే చెరువు కట్ట మళ్లీ తెగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన పడుతున్నారు.  

రామాంతపూర్​ డివిజన్ పరిధిలో రెండు చెరువులకు 3 ప్రధాన నాలాలున్నాయి. పైనున్న  ఓయూ నుంచి వరద నీరు రామాంతపూర్​లోని పెద్ద చెరువు, అక్కడి నుంచి కింది చెరువులోకి వెళ్లే విధంగా గొలుసు కట్టు వ్యవస్థ ఉండేది. ఐదేండ్ల క్రితం పెద్ద చెరువు నుంచి కింది చెరువులోకి నీరు చేరకుండా అధికారులు పైప్​లను కాంక్రీట్​తో పూడ్చివేశారు. దీంతో గతేడాది కురిసిన భారీ వానలకు ప్రేమ్ నగర్, పటేల్ నగర్, నరేంద్ర నగర్, హైమద్ నగర్, చెన్నారెడ్డి సి–బ్లాక్, బాపునగర్ ప్రాంతాలు నీట మునిగిపోయాయి.     

హైదరాబాద్, వెలుగు: గతేడాది కురిసిన భారీ వానలకు కట్టలు తెగిపోయిన చెరువులు కాలనీలు, బస్తీలను నీట ముంచాయి. ఆ సమయంలో అధికారులు చెరువులకు తాత్కాలిక రిపేర్లు చేయించి వదిలేశారు.  యథేచ్చగా నాలాల ఆక్రమణలు జరుగుతున్నా...చెరువుల తూములన్నీ పాడైపోతున్నా రిపేర్ల గురించి పట్టించుకోవడం లేదు. ఏడాది దాటినా సిటీ శివార్లలోని చెరువుల తీరు మారకపోవడంతో మరోసారి వరద ముంపు పొంచి ఉంటదేమోనని ఆయా ప్రాంతాల జనం భయపడుతున్నారు. లేక్ సిటీలో జల వనరులకు రక్షణ లేకుండాపోయినా... కనీసం ఉన్న చెరువులను పరిరక్షించుకోవడంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. గతేడాది వానలకు  ధ్వంసమైన చెరువులు, కుంటలు, నాలాల అప్రోచ్ ఛానళ్లను మళ్లీ రీస్టోర్ చేయకపోవడంతో... ఈ సారి భారీ వానలు పడితే మళ్లీ వరదలు తప్పేలా లేవని సిటీ జనం ఆందోళన చెందుతున్నారు.

ఆక్రమణలు తొలగించలే...
గతేడాది వరదల బీభత్సానికి భారీ ఆస్తి నష్టమే జరిగింది. 4 నెలల పాటు వరదల ఇబ్బందులు తొలగిపోలేదు. ఈ క్రమంలో నీట మునిగిన కాలనీల్లో పర్యటించిన అధికారులు, లీడర్లు వరదలను నియంత్రించేలా పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని, చెరువుల అప్రోచ్ ఛానళ్లను రీస్టోర్ చేయాలని డిసైడ్ చేశారు. కానీ ఇప్పటి  వరకు ఏ ఒక్క చెరువుపై పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదు.  బ్యూటిఫికేషన్ పేరిట నిధులు వృథా చేస్తున్నారే తప్ప...  గుర్రపు డెక్క తొలగింపు, పూడిక, చెడిపోయిన ఇన్ లెట్, అవుట్ లెట్లకు రిపేర్లు చేయలేదు. గతేడాది మైలార్ దేవ్ పల్లి డివిజన్ లోని పల్లె చెరువు కట్ట తెగిపోవడంతో... అలీ నగర్, ఆషామాబాద్ తోపాటు ఓల్డ్ సిటీలో పలు కాలనీలు నీట మునిగిపోయాయి. దీంతో తాత్కాలికంగా అప్పటి వరకు కట్టకు రిపేర్లు చేయించిన అధికారులు మరోసారి చెరువు కోతకు  గురి కాకుండా పక్కా నిర్మాణాలేవీ చేపట్టలేదు.

ముందస్తు చర్యలు చేపట్టలే..
గతేడాది  నీట ముంచిన చెరువులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ చర్యలను అధికారులు చేపట్టలేదు.  గతంలో రామాంతపూర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ నాలాల ఆక్రమణలు, ఇన్ లెట్, అవుట్ లెట్లను సరిచేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించినా ఇప్పటికీ పెద్ద చెరువులోని నీళ్లు బయటకెళ్లే మార్గాలకు అధికారులు రిపేర్లు చేయించలేదని స్థానికులు మండిపడుతున్నారు. గత అక్టోబర్​లో వచ్చిన వరదలకు జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో బైరాంఖాన్ చెరువు నిండిపోయి పక్కనే ఉన్న ఉస్మాన్‌‌నగర్‌‌, సైఫ్‌‌ కాలనీ, హబీబ్‌‌కాలనీ, అహ్మద్‌‌నగర్‌‌ బస్తీల్లో నీరు చేరింది. 5  నెలల పాటు 700కు పైగా ఇండ్లు నీట మునిగే ఉన్నాయి. దీంతో అధికారులు నీటిని తొలగించే వరకు స్థానికులు అక్కడి నుంచి తరలిపోయి ఇతర ప్రాంతాల్లో ఉన్నారు.  ఈ చెరువులో నీటిని తొలగించేందుకు అధికారులు భారీ పైపు లైన్లు వేసినా, కిందికి పోయే నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. చెరువు భూముల్లో నిర్మించిన రాయల్ కాలనీల్లోకి నీళ్లు వెళ్లకుండా ఉండేందుకే ఆ పైపు కిందికి వేయడానికి అధికారులు వెనుకడుగు వేస్తున్నారంటున్నారు. దీంతో తమకు వరద నీళ్లతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  బైరాంఖాన్ చెరువు కట్ట ఎత్తు పెంచి వెడల్పు చేయాలని గతేడాదే ఆదేశాలు వచ్చినా అధికారులు ఇంకా పనులు మొదలుపెట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

సర్వే జరగలే..
సిటీలో గతేడాది వరదలతో చెరువులపై సర్వే చేయాలని భావించారు. ఇందులో భాగంగా ప్రతి చెరువులోకి వచ్చే నాలాలు, నీరు చేరే, పోయే తూములతోపాటు, అలుగులకు రిపేర్లు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.  ఆయా చెరువులను సర్వే చేసి, చేపట్టాల్సిన పనులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది.  కానీ ఇప్పటికీ ఏ ఒక్క చెరువును పర్యవేక్షించలేదు. వాటి టోపొగ్రఫిక్ ఛానళ్లను రీ స్టోర్ చేయలేదు. దీంతో ఈ సారి కుండపోతగా వానలు పడితే..  వరద తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని జనం భయాందోళనలో ఉన్నారు.

కార్పొరేటర్లతో మేయర్ సమావేశం
రాజేంద్ర నగర్ సెగ్మెంట్ పరిధిలోని శానిటేషన్​సమస్యలపై   డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులతో  కలిసి మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి  సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం బల్దియా హెడ్డాఫీసులో జరిగిన ఈ సమావేశంలో చెరువులు, నాలాలపై చర్చించారు. ఓరా , శివరాంపల్లి, అప్పా చెరువుల వల్ల చుట్టుపక్కల కాలనీల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉందని స్థానిక కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు.  గతేడాది వరదల సమయంలో ఈ ప్రాంతాల జనం చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. దోమలు ఎక్కువయ్యాయని, శానిటేషన్ సమస్యలు కూడా ఏర్పడినట్లు కార్పొరేటర్లు మేయర్‌‌కు వివరించారు.  కార్పొరేటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తనకు వివరణ ఇవ్వాలని అధికారులను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు.  సమావేశంలో  కార్పొరేటర్లు  తోకల శ్రీనివాస్​ రెడ్డి,  శంకర్, జయప్రకాష్, సంగీత, అర్చన, రామారావు, ముబీన్, నవాజ్, అధికారులు పాల్గొన్నారు. 

అధికారుల నిర్లక్ష్యమే...
గతేడాది వర్షాలకు రామాంతపూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు నీట మునగడానికి అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే కారణం. పెద్ద చెరువు నుంచి కింది చెరువుకు నీరు వెళ్లకుండా అప్రోచ్ ఛానళ్లను అడ్డుకున్నారు. దీంతో ఉస్మానియా క్యాంపస్ నుంచి వచ్చే వరద నీరు పెద్ద చెరువు నుంచి కింది చెరువుకు వెళ్లడానికి వీల్లేకపోవడంతోనే వరదలు వచ్చాయి. 15 కాలనీలు, బస్తీలు నీటమునిగాయి.  
–  శ్రీనివాస్,  సీపీఎం కార్యదర్శి

కరకట్టలపై ఫోకస్ చేయాలె
గత ఏడాది రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అప్పా చెరువు కరకట్ట తెగి భారీగా ఆస్తి నష్టం కలిగింది. అధికారులు నామమాత్రంగా ఏర్పాటు చేసిన కరకట్టలు, ఏడాది కాకుండానే దెబ్బతిన్నాయి.  ఈ సారి భారీ వానలు పడే అవకాశమున్నందున అధికారులు  రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది.  గతేడాది మాదిరి వరద ముంపు లేకుండా   చర్యలు తీసుకోవాలి. చెరువుల బ్యూటిఫికేషన్, కరకట్టల పునర్నిర్మాణంపై అధికారులు ఫోకస్ పెట్టాలి.

– ధనుంజయ్, స్థానికుడు