
- కక్షపూరితంగా ఎవరినీ వేధించం, తప్పు చేస్తే వదలం
- దందాలు చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతామన్న రెవెన్యూ మంత్రి
ఖమ్మం, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈనెల 20న అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి దోచుకున్నా, తమ ప్రభుత్వానికి ఉత్తి తాళాలు ఇచ్చినా మనస్సు ఉంది కాబట్టి అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రెండు గ్యారంటీలను అమలు చేశామని, ఈనెల 28న మరో రెండింటిని అమలు చేస్తామని వెల్లడించారు. సోమవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలతో లింక్ తెగిపోవడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ప్రజల ఆలోచనలు, ఆశలు, ఆకాంక్షల అమలు ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని చెప్పారు. అన్ని పథకాలను త్వరలోనే సామాన్యుల ఇంటికి చేరుస్తామన్నారు. ‘‘మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకొని అధికారులపై వాటిని రుద్దింది. నాయకులు, అధికారులపై కక్షసాధింపు ఉండదు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని, భూములు ఆక్రమించిన వారిని, బినామీ కాంట్రాక్టులతో దోచుకున్న వారిని వదిలిపెట్టం. ఇసుక, మట్టి, మైనింగ్ దందాలు చేసిన వారిని ఉక్కుపాదంతో తొక్కుతాం. కొంతమంది సంపాదన కోసం కక్కుర్తి పడి వాటిని అన్ని చోట్లకు విస్తరించారు. ఇంకా అధికారంలో ఉన్నామన్న మత్తులో ప్రతిపక్ష నాయకులు పొగరుబోతు గిత్తల్లా రంకెలేస్తున్నారు.వారికి మా సీఎం సరైన సమాధానం చెప్పారు. ధరణిలో జరిగిన తప్పులు ప్రక్షాళన చేసి, ప్రజలకు నష్టం లేకుండా చేస్తాం. రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. ఎల్ఆర్ఎస్, జీపీ లేఅవుట్లపై కలెక్టర్ల మీటింగ్ లో చర్చిస్తాం”అని అన్నారు.
జీపీ ఎన్నికల షెడ్యూల్‌పై..
గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, పార్లమెంట్ ఎన్నికలకు లోబడి వాటి షెడ్యూల్ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్లాన్ లేకుండా, హెడ్ వర్క్స్పనులు చేయకుండా, చివరి కాల్వలు తవ్వారని మండిపడ్డారు. రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నా, అందుకు తగిన విధంగా పని కనిపించడం లేదన్నారు. మొత్తం ప్రాజెక్టు బడ్జెట్ రూ.13 వేల కోట్లలో సీతారామ పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. సీతారామ ప్రాజెక్టుపై ఇరిగేషన్మంత్రితో కలిసి రెండు మూడు రోజుల్లో మళ్లీ సమీక్ష ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మీడియా సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ పాల్గొన్నారు.