ఆశావహులతో వరుస భేటీలు..అసంతృప్తుల బుజ్జగింపులు

ఆశావహులతో వరుస భేటీలు..అసంతృప్తుల బుజ్జగింపులు
  • పరిస్థితులను చక్కదిద్దుతున్న పొంగులేటి, తుమ్మల
  • అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి ఖమ్మంలో ముమ్మర కసరత్తు
  • పాలేరులో పొంగులేటి, ఖమ్మంలో తుమ్మల గ్రౌండ్​వర్క్
  • ఓట్లు చేజారకుండా వ్యూహాలు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు కాంగ్రెస్​క్యాండేట్లను ప్రకటించకపోయినప్పటికీ నేతలు ఎన్నికల ప్రచారం షురూ చేశారు.హైకమాండ్​నుంచి కన్ఫర్మేషన్ అందుకున్న కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల వ్యూహాలపై కసరత్తు మొదలుపెట్టారు. పాలేరు నియోజకవర్గంలో టికెట్ ఆశించి భంగపడిన అసంతృప్త నేతలను పొంగులేటి కలిసి బుజ్జగిస్తున్నారు. ఖమ్మం సిటీలోని ప్రముఖులతో తుమ్మల వరుసగా భేటీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు.

తుమ్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాలని స్వయంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పాలేరు నుంచి తుమ్మల ఖమ్మంకు షిఫ్ట్​అయ్యి గ్రౌండ్​వర్క్ చేస్తున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాలేరు నియోజకవర్గంలోని పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. నాలుగేళ్లుగా పాలేరులో పార్టీ కోసం పనిచేస్తూ, అసెంబ్లీ టికెట్ ఆశించిన వారిని కలిసి సముదాయిస్తున్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడితే మంచి అవకాశాలు ఉంటాయని హామీ ఇస్తున్నారు.

రాయలను ఒప్పించిన పొంగులేటి

గత ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్​పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన కందాల ఉపేందర్​రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ లో చేరడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్​పై ప్రభావం పడింది. అప్పటి నుంచి కార్యకర్తలను కాపాడుకొంటూ వస్తున్న వారిలో రాయల నాగేశ్వరరావు కూడా ఒకరు. గ్రానైట్ వ్యాపారి అయిన ఆయన గతంలో ప్రజారాజ్యం తరఫున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్​లోకి వచ్చారు. రెండేళ్ల కింద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన దాదాపు నాలుగైదు కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరిగింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్​టికెట్ కన్ఫామ్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పొంగులేటి చేరికతో రాయలకు మొండిచేయి తప్పలేదు. పొంగులేటి ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నా, కొద్దిరోజులుగా పాలేరుపైనే ఫోకస్​పెట్టారు. అందుకోసం తుమ్మలను ఒప్పించి, ఖమ్మంలో పోటీ చేసేలా నచ్చజెప్పారు. ఆయనతోపాటు టికెట్ ఆశించి భంగపడిన రాయల నాగేశ్వరరావు ఇంటికి మంగళవారం పొంగులేటి వెళ్లారు. తన విజయం కోసం కలిసి పనిచేయాలని కోరారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తానని రాయల నాగేశ్వరరావు ప్రకటించారు. 

మద్దతు కూడగడుతున్న తుమ్మల 

ఖమ్మం సిటీకి చెందిన పలువురు ప్రముఖులతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం భేటీ అయ్యారు. విద్యావేత్త, నిర్మల్ హృదయ్​ విద్యాసంస్థల అధిపతి వంగా సాంబశివారెడ్డితో వచ్చే ఎన్నికలపై చర్చించారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరగా, సాంబశివారెడ్డి సానుకూలంగా స్పందించారు. సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. నామినేషన్​వేసేందుకు అవసరమైన రూ.10,116 ఫీజును తుమ్మలకు సాంబశివారెడ్డి దంపతులు అందజేశారు.

తర్వాత సిటీలోని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే కూరపాటి ప్రదీప్​ కుమార్​ఇంటికి తుమ్మల వెళ్లారు. కాంగ్రెస్​కు సపోర్ట్ చేయాలని కోరారు. తర్వాత పలువురు డాక్టర్లతోనూ తుమ్మల సమావేశమయ్యారు.