V6, వెలుగుపై బ్యాన్.. కేసీఆర్ ది సిగ్గుమాలిన చర్య : పొంగులేటి

V6, వెలుగుపై బ్యాన్.. కేసీఆర్ ది సిగ్గుమాలిన చర్య : పొంగులేటి

ఖమ్మం : V6 న్యూస్ చానెల్, వెలుగు దిన పత్రికను ప్రభుత్వ కార్యాలయాల్లోకి రానివ్వకుండా నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని తమిళనాడు బీజేపీ సహాయ ఇన్ చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన సొంతం రాజ్యాంగం కాదని వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని సూచించారు. 

V6, వెలుగు పేపర్ ను బ్యాన్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటిదే అని పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఫ్లెక్సీలు వేసుకుని ప్రజాస్వామ్యాన్ని బతికించమని కోరే కేసీఆర్.. V6, వెలుగును ఎలా బ్యాన్ చేస్తారని ప్రశ్నించారు. ‘‘దమ్ముంటే V6, వెలుగును బ్యాన్ చేస్తున్నట్లు జీవో విడుదల చేసి చూడు.. నీకు రాజ్యాంగం ఏంటో చూపిస్తాం’’ అంటూ సీఎం కేసీఆర్ ని పొంగులేటి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. 

మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకే నిషేధించిన బీఆర్ఎస్.. తాజాగా ప్రభుత్వ కార్యక్రమాలకూ అనుమతించడం లేదు. జూన్ 14వ తేదీ బుధవారం రోజు నిమ్స్ కొత్త బ్లాక్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి V6, వెలుగు రిపోర్టర్లను రానివ్వలేదు. ఇది ప్రభుత్వం కార్యక్రమం కదా అని ఎంత మొత్తుకున్నా అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేశారు. తామేమీ చేయలేమని పై నుంచి అలా ఆర్డర్స్ ఉన్నాయంటూ పెదవి విరిచారు.