జూబ్లీహిల్స్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి..కేంద్ర స్కీమ్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లండి: పొంగులేటి సుధాకర్ రెడ్డి

జూబ్లీహిల్స్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి..కేంద్ర స్కీమ్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లండి: పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జాతీయ సహ-ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్‌ మోతీ నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో బూత్, శక్తి కేంద్రాలు, సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం ప్రచార వ్యూహాలపై చర్చించారు. 

క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేయాలని, బూత్ స్థాయిలో దృష్టి పెట్టాలని తీర్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌లను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు గరికపాటి రామ్మోహన్, చాడ సురేశ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, సుభాష్ చంద్ర, సారంగపాణి, ప్రదీప్ రావు, ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు.