బీఆర్ఎస్లోకి పొన్నాల.. జనగామ టికెట్ కేటాయించే చాన్స్ !

బీఆర్ఎస్లోకి పొన్నాల.. జనగామ టికెట్ కేటాయించే చాన్స్ !
  • పల్లాకు ఈ సారి అవకాశం లేనట్టే
  • ఎల్లుండి కేసీఆర్ బీఫారం ఇచ్చే చాన్స్
  • నర్మ గర్భంగా పొన్నాల సమాధానం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ చేరనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు జనగామ టికెట్ ఇచ్చేందుకు కారు పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. జనగామ కాంగ్రెస్ టికెట్ ఆశించిన పొన్నాల నిన్నటి వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనేతలను కలిశారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని, బీసీలకు 34 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఆశాజనకంగా కనిపించకపోవడంతో ఆయన ఇవాళ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, నలభై ఐదేండ్ల పాటు పార్టీలో కొనసాగిన తాను ఈ రెండున్నరేండ్లుగా అనేక అవహేళనలు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. 

రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తన రాజకీయ భవిష్యత్ అనేది ఎవరెవరో ఏదో ఊహిస్తారని దానికి తానేం సమాధానం చెప్పలేనంటూ దాటవేశారు. బీఆర్ఎస్ లో చేరుతున్నారా..? అని ప్రశ్నిచంగా అది కూడా మీరే డిసైడ్ చేస్తారా..? అంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. తాను పదవుల కోసం రాజీనామా చేయలేదని చెప్పిన పొన్నాల.. జనగామ బరిలో ఉంటారా..? అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఇదిలా ఉండగా.. ఆయన బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. జనగామ టికెట్ పై కారు పార్టీ నుంచి క్లారిటీ వచ్చిందని, బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉంటారని తెలుస్తోంది.

 జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కొనసాగుతున్నారు. నర్సాపూర్, గోషామహల్, జనగామ, నాంపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోటీ పడ్డారు. దాదాపు పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు ప్రచారం జరిగింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇచ్చి సయోధ్య కుదుర్చింది గులాబీ పార్టీ అధినాయకత్వం. రెండు రోజుల క్రితం జనగామలో జరిగిన సమావేశంలో పల్లారాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్టేజీని కూడా షేర్ చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని ఆలింగనం చేసుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ముత్తిరెడ్డికి పాదాభివందనం చేయడం విశేషం..

టికెట్ రాదనే..

పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ తరఫున జనగామ టికెట్ ఆశించిన పొన్నాల లక్ష్మయ్య తనకు రాదని, ఆ టికెట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇస్తారని నిర్ధారించుకున్న తర్వాతనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సునీల్ కనుగోలు సర్వే సైతం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలుస్తారని తెలిపిందని సమాచారం. ఈ నేపథ్యంలో పలు సెగ్మెంట్లలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫ్లాష్ సర్వే చేయించారు. ఫలితాలు ఎలా వచ్చాయన్నది వెల్లడించలేదు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న పొన్నాల పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ పై బలమైన హామీ లభించిన తర్వాతే కాంగ్రెస్ ను వీడారని తెలుస్తోంది.

ALSO READ : Cricket World Cup 2023: భారతీయులను క్షమాపణలు కోరిన పాకిస్తాన్ అందగత్తె