Cricket World Cup 2023: భారతీయులను క్షమాపణలు కోరిన పాకిస్తాన్ అందగత్తె

Cricket World Cup 2023: భారతీయులను క్షమాపణలు కోరిన పాకిస్తాన్ అందగత్తె

వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత్‌కు వచ్చిన స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్, పాకిస్తాన్ అందగత్తె జైనాబ్ అబ్బాస్ హడావుడిగా దేశం విడిచి  వెళ్లిపోయిన విషయం తెలిసిందే. హిందువులను కించపరిచేలా గతంలో సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలే చిక్కుల్లో పడేశాయి. మొత్తానికి ఈ అమ్మడు దిగొచ్చింది. భారతీయులను క్షమించమని కోరింది.

ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్‌లకు ప్రజెంటర్ వ్యవహరించేందుకు జైనాబ్ అబ్బాస్ భారత్‌కు వచ్చింది. అక్టోబర్ 6న హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ఈ భామ.. తన అంద చందాలతో అభిమానులను బాగానే ఆకట్టుకుంది. అయితే, ఆమె గతంలో మన దేశాన్ని, హిందూ మతాన్ని కించపరుస్తూ చేసిన పాత ట్వీట్‌లు బయట పడటంతో భారత అభిమానుల నుంచి ఆమెకు సందేశాలు వెల్లువెత్తాయి. 

మరోవైపు వినీత్ జిందాల్ అనే న్యాయవాది.. జైనాబ్ అబ్బాస్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇండియన్ పీనల్ కోడ్ 153 ఏ, 295, 506, 121, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేయాలని ఢిల్లీలోని సైబర్ సెల్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ఇంకేముంది, అరెస్ట్ భయంతో ఉన్నపళంగా దేశం విడిచి పారిపోయింది. మొదట దుబాయ్‌ చేరుకొని.. అక్కడి నుంచి స్వదేశానికి వెళ్లిపోయింది.

భారతీయులారా క్షమించండి.. 

స్వదేశానికి చేరుకున్న జైనాబ్ అబ్బాస్ కు బుద్ధి వచ్చినట్లుంది. హిందువులను క్షమించమని కోరుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. "సర్క్యులేట్ చేయబడిన పోస్ట్‌ల వల్ల కలిగే బాధను నేను అర్థం చేసుకున్నాను.. తీవ్రంగా చింతిస్తున్నా. వాటి వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా.. నన్ను దేశం విడిచిపెట్టి వెళ్లమని ఎవరూ అడగలేదు.. బహిష్కరించలేదు. ఆన్‌లైన్‌లో వెల్లువెత్తుతున్న సందేశాలతో నేను భయపడ్డాను.. నా భద్రతకు ఎలాంటి ముప్పు లేనప్పటికీ, నా కుటుంబసభ్యులు, స్నేహితులు ఆందోళన చెందారు.  అందువల్లే నా ఇష్టం మేరకే ఇండియాను విడిచివెళ్లాను.." అని జైనాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.