
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సర్కారు బంగారు తెలంగాణ చేస్తే.. వేల కొద్ది సమస్యలతో జనం ప్రజావాణికి ఎందుకొస్తున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 12 రోజులు కూడా కాకముందే హామీలన్నీ నకిలీవని ఎలా అంటారని నిలదీశారు. విత్తనం వేసి మొలకెత్తాక కదా నకిలీదో అసలుదో తెలిసేది అని విమర్శించారు.12 రోజుల్లోనే ఏం చేయలేదంటూ తమను స్కాన్ చేస్తున్నారా అని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాజీ ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్లతో కలిసి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
హామీలు అమలుపై ఆరు నెలలు ఓపిక పట్టాలని, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ చెప్పినట్టు బీఆర్ఎస్ వాళ్లు రోజూ సభలో ఆరు గ్యారంటీల జపం చేయాలన్నారు. తాము హామీలను అమలు చేస్తామని, వాళ్లు గ్యారంటీల జపం చేయాలని అన్నారు. ‘‘ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే రైతుబంధు ఎందుకు వేయలేదని ఒకరంటే, ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతదని మరొకరు అన్నరు. కడియం శ్రీహరి వ్యాఖ్యలన్నీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ వ్యాఖ్యలుగానే పరిగణించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పడిపోతుందని కామెంట్ చేస్తే వాళ్లు కనీసం ఖండించలేదు”అని విమర్శించారు.
ఒక్క రోజే అంత మందిని సస్పెండ్ చేస్తరా
‘‘ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది పార్లమెంట్. అలాంటి సభలో దుండగులు దూకి సభ్యులపైకి గ్యాస్ వదిలారు. శాంతి భద్రతలు, పార్లమెంట్భద్రతపై ప్రధాని మోదీని ఎంపీలు ప్రశ్నిస్తే సస్పెండ్‌చేశారు. బ్రిటీష్ పరిపాలన సహా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే 79 మంది ఎంపీలను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయించింది. ప్రజాస్వామ్యానికి అది చీకటి రోజు” అని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నదన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఆనాటి పెద్దలు ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలను స్థాపిస్తే.. ప్రస్తుత పాలకులు మేమిద్దరం.. మాకిద్దరు అన్న చందాన కార్పొరేట్లకు కట్టబెడుతున్నరు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీజేపీ అనుబంధ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నది. పార్లమెంటులో గొంతు విప్పినా సస్పెండ్ చేస్తున్నారు.
ఆనాడు తెలంగాణ కోసం మేము పోరాడినా.. ఇంతటి ఘోరమైన వ్యవస్థలను చూడలేదు. పార్లమెంట్భద్రంగా ఉండాలి.. దేశం భద్రంగా ఉందని ప్రజలు అనుకోవాలి. కానీ, బీజేపీ ఎంపీ సిఫార్సు మీద, బీజేపీ కార్యకర్తలు పార్లమెంటులో దాడి చేస్తే.. వారిని రక్షించేందుకు బీజేపీ వాళ్లు ప్రయత్నిస్తున్నారు. దాన్ని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్చేస్తుంటే బీజేపీ అంటే ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ నుంచి ఉన్న కేంద్ర మంత్రిగానీ, ముగ్గురు బీజేపీ ఎంపీలుగానీ దీనిపై మాట్లాడాలి. ప్రజాస్వామ్యపరంగా సిద్ధాంతపరమైన విలువలు లేవా?’’ అని ప్రశ్నించారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ఎంపీలపై సస్పెన్షన్‌ను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
ఇంకా అధికారంలోనే ఉన్నమనుకుంటున్నరు
ఆనాడు ఇరిగేషన్‌ప్రాజెక్టులపై పవర్పాయింట్ప్రెజెంటేషన్ చేసేందుకు అవకాశం అడిగినా బీఆర్ఎస్ఇవ్వలేదని, ఇప్పుడు వారెలా అడుగుతారని పొన్నం ప్రభాకర్మండిపడ్డారు. ఆనాడు ప్రతిపక్షంగా తమకు ప్రెజెంటేషన్‌కు అవకాశం ఇచ్చి ఉంటే ఇప్పుడు ప్రాజెక్టులు కుంగిపోవడం లాంటి ఘటనలు జరగకపోతుండే కదా అని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు నిజాలు చెప్పాలని అనుకుంటుంటే.. భుజాలు తడుముకున్నట్టు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భావన వారికి పోవడం లేదా అని నిలదీశారు. ప్రజలు తీర్పు ఇచ్చి మార్పు కోరుకున్నారని, అది బీఆర్ఎస్వాళ్లు గమనించాలని సూచించారు. ట్రెజరీ బెంచ్‌నుంచి ప్రతిపక్ష బెంచ్‌కు వాళ్లు వెళ్లారని, అది గుర్తించకుండా మైకులు విరగ్గొడతాం.. అది విరగ్గొడతాం అంటే కుదరదని హెచ్చరించారు. కాలం మారుతుందని, దానికితగ్గట్టు నడుచుకోవాలన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకున్నారని, అందుకే ప్రగతిభవన్ఇనుప కంచెలను బద్దలు కొట్టామని తెలిపారు.
ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి..
మహిళలకు ఫ్రీ జర్నీని ఈ నెల 9న ప్రారంభించామని, ఏవైనా సమస్యలుంటే 15 రోజుల్లో పరిష్కరిస్తామని ఆనాడే చెప్పామని గుర్తు చేశారు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీమ్.. ఆటో కార్మికులకు వ్యతిరేకం కాదన్నారు. వారికి అన్యాయం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ఆటో కార్మికులకు ఏం చేస్తే మేలు జరుగుతుందనేదానిపై కేబినెట్లో కూడా చర్చించామని స్పష్టం చేశారు. ఆటో కార్మికులంతా తమ కుటుంబ సభ్యులేనని, ఏం చేస్తే న్యాయం జరుగుతుందో వాళ్లు చెప్తే తప్పకుండా అది చేస్తామన్నారు. బస్సులను ఎక్కడా తగ్గించలేదని, కొత్త బస్సులను తెస్తామని చెప్పారు.