బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న  సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుందని.. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ యాత్రను అడ్డుకుంటారనే భయంతో పోలీసు భద్రత పెంచితే.. ఇతరత్రా శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు కలుగుతాయని..  కాబట్టి బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం ఆయన.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వీడియోను విడుదల చేశారు.

ఈరోజు నుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా నియోజకవర్గంలో, రాష్ట్రంలో బీజేపీ ఆడుతున్న డ్రామా విషయంలో పార్టీ కార్య కార్యకర్తలను, నాయకులను కోరేది ఏంటంటే..
"5 ఏండ్లు ఎంపీగా ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, ఒక్కసారి కూడా నియోజకవర్గంలో కనిపించని బండి సంజయ్.. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తున్న యాత్ర సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యల పరిణామాలతో హుస్నాబాద్ నియోజకవర్గంలో చేటు చేసుకున్న పరిస్థితుల దృష్ట్యా ఆ యాత్రను అడ్డుకుంటామనే భయంతో దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నందున పోలీసులు ఇంటర్మీడియట్ బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజల ఆశీర్వాదంతో గెలిచి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కంకణబద్ధున్నై  నా రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలనే కార్యాచరణతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి నా వంతుగా కృషి చేస్తున్నాను.  బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలనే ఎలాంటి ఉద్దేశం మాకు లేదు. మతిభ్రమించి మనస్థాపం కలిగించేలా చేసిన వ్యాఖ్యలకు బాధపడినా, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో  నా నియోజకవర్గ ప్రజలకు నా కార్యకర్తలకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.  ఎక్కడ కూడా బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోకండి. ఇలా భయంతో పాదయాత్రను అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసుల బందోబస్తును పెంచితే ఇంటర్ పరీక్షల నిర్వహణకై, ఇతరత్రా శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు కలుగుతాయని తెలియజేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలనను అందించాలనే ముందుకు నడుస్తూ, ప్రజా సేవలో ఉంటాను" అని తెలిపారు.