మీడియాపై బ్యాన్ విధించడం మానవ హక్కులను ఉల్లంఘించడమే

 మీడియాపై బ్యాన్ విధించడం మానవ హక్కులను ఉల్లంఘించడమే

హైదరాబాద్, వెలుగు:వీ6 చానెల్, వెలుగు పత్రికను బీఆర్ఎస్ పార్టీ నిషేధించడం ప్రజాస్వామ్యంపై దాడేనని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సమన్వయకర్తలుగా ఉంటున్న మీడియాపై బ్యాన్ విధించడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని బుధవారం ఒక ప్రకటనలో ఆయన స్పష్టంచేశారు. వీ6, వెలుగును నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘వీ6లో వచ్చే కథనాలు తెలంగాణ సంస్కృతి, యాస, భాషకు నిదర్శనమని కేసీఆర్ చెప్పలేదా? తీన్మార్​ వార్తలపై ప్రశంసలు కురిపించలేదా?’’ అని పొన్నం ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై మంత్రి కేటీఆర్​ను ప్రశ్నించినందుకు కక్ష పూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ ఏనాడూ అటు సెక్రటేరియెట్​లోగానీ, ఇటు ప్రగతి భవన్​లోగానీ ప్రజలకు అందుబాటులో లేరని, ప్రజలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొన్ని సందర్భాల్లో మీడియా సంస్థలను ఆశ్రయిస్తున్నారని అన్నారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేక కోణంలో చూస్తూ నిషేధం విధించడం సరికాదన్నారు. వైఫల్యాలను ఎత్తిచూపిన వారి సంగతి చూస్తామంటూ బెదిరించడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.