బీసీలకు విద్యలో ప్రాధాన్యత ఇస్తం

బీసీలకు విద్యలో ప్రాధాన్యత ఇస్తం

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు పీసీసీ ఓబీసీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రం వచ్చాక బీసీలు చదువుకు దూరం అవుతున్నారని, ఈ క్రమంలోనే వారి చదువులకు డిక్లరేషన్​లో ప్రాధాన్యత ఇచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు. బుధవారం ఇందిరాభవన్​లో ఓబీసీ డిక్లరేషన్​ కమిటీ సమావేశం నిర్వహించారు. తర్వాత పొన్నం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బలహీనవర్గాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. 

సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. అన్ని రంగాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని, రాజకీయంగానూ తగిన సీట్లు కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే పీఏసీలో నిర్ణయం మేరకు సీట్లు కేటాయించాలని తీర్మానం చేశామని చెప్పారు. బీసీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని డిక్లరేషన్ ద్వారా తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఈరవర్తి అనిల్, సంగిశెట్టి జగదీశ్, సునీతా రావ్ తదితరులు పాల్గొన్నారు.