త్వరలో మరిన్ని బస్సులు కొంటం: పొన్నం ప్రభాకర్

త్వరలో మరిన్ని బస్సులు కొంటం:  పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుందని, ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను దేశానికి తెలియజేసేలా సంస్థను తీర్చిదిద్దుతామని ట్రాన్స్​పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులు త్వరలోనే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆ బస్సుల్లో విధులు నిర్వహించేందుకు సిబ్బందిని రిక్రూట్ మెంట్ కోసం ప్రభుత్వ అనుమతులు కోరామని చెప్పారు.

బుధవారం హైదరాబాద్ కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో కారుణ్య నియామకం కింద నియమితులైన 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాలు అందజేశారు. వారిలో 47 మంది పురుషులు, 33 మంది మహిళలు ఉన్నారు. వీరందరికి నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. పాసింగ్ ఔట్ పరేడ్​లో మంత్రి పొన్నం మాట్లాడారు. 

నిబద్ధతతో పని చేయాలి

‘‘ఆర్టీసీ కుటుంబంలో చేరుతున్న కానిస్టేబుళ్లంతా నిబద్ధతతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలి. చనిపోయిన, మెడికల్ అన్​ఫిట్ అయిన సిబ్బంది కుటుంబాలను సంస్థ ఆదుకుంటున్నది. కారుణ్య నియామ‌‌‌‌కాల కింద 1,700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. తాజాగా మరో 813 మందిని నియమిస్తున్నాం. రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది’’అని పొన్నం తెలిపారు. మహాలక్ష్మి ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 85 శాతానికిపైగా నమోదవుతున్నదన్నారు. మేడారం జాతర నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు నిబద్ధతతో పని చేసి, జాతరను సక్సెస్ చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు. సంస్థ తరఫు నుంచి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ సిబ్బందిని స్ఫూర్తిగా తీసుకుని విధులు నిర్వహించాలని కానిస్టేబుళ్లకు ఎండీ సజ్జనార్ సూచించారు.

డ్రైవర్, కండక్టర్​ను పరామర్శించిన సజ్జనార్

ఈ నెల 4న 8ఏ బస్ రూట్​లో ఫరూక్​నగర్ డిపోకు చెందిన డ్రైవర్ షేక్ అబ్దుల్, కండక్టర్ రమేశ్​పై ఇద్దరు దుండగులు బ్యాట్​తో దాడి చేశారు. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న వారిని ఎండీ సజ్జనార్ పరామర్శించారు. దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.