
- ఆర్టీసీని సెట్ చేస్తం.. బకాయిలన్నీ చెల్లిస్తం: మంత్రి పొన్నం
- కార్మికులు, ప్యాసింజర్ల రక్షణకు ప్రాధాన్యం ఇస్తం
- మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటివరకు 6 కోట్ల మంది జర్నీ
- 1,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తమని వెల్లడి
- 50 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఆర్టీసీ విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సెట్ చేసి, సంస్థను గాడిన పెడ్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీలు, పీఎఫ్, సీసీఎస్, డీఏ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు, సంస్థ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి ఎంతో ఉందని గుర్తుచేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత జర్నీని ప్రారంభించామన్నారు. ఈ నెల 9న స్కీమ్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని, దీన్ని బట్టి ఈ స్కీమ్ ఎంత సక్సెస్ అయిందో అర్థమవుతుందని పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ మార్గ్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీలో 50 కొత్త బస్సులను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీపీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జ్యోతి బుద్దప్రకాశ్‌లతో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. అనంతరం స్లీపర్ బస్సులో సెక్రటేరియెట్ వరకు జర్నీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడడం వల్లే సంస్థ ఈ స్థాయిలో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు ఇవ్వండి..
ఆర్టీసీ అభివృద్ధికి ప్రజలు, కార్మికులు, అధికారులు సలహాలు ఇవ్వాలని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుందని మంత్రి పొన్నం చెప్పారు. గత ప్రభుత్వం సంస్థ అభివృద్ధికి ఎవరి సలహాలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఈడీలు, ఆర్‌ఎంలు, డీఎంలు అమలు చేయాలని ఆయన సూచించారు. త్వరలో 1,000 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రూ.400 కోట్లతో మరో 1,050 బస్సులు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మహిళా ప్యాసింజర్ల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని, దీనికి సంబంధించి డీజీ, సీపీలతో కూడా మాట్లాడానన్నారు. హైదరాబాద్‌లో స్టూడెంట్స్ రద్దీకి అనుగుణంగా రానున్న రోజుల్లో ప్రత్యేక బస్సులు నడిపే ఆలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినయ్: హన్మంతు ముదిరాజ్
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆర్టీసీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హన్మంతు ముదిరాజ్ అన్నారు. శనివారం సెక్రటేరియెట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి ఆర్టీసీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మహాలక్ష్మి స్కీమ్‌ను ప్రారంభించిన వెంటనే ఆర్టీసీకి సబ్సిడీ నిధులు రూ.374 కోట్లు విడుదల చేయడం అభినందనీయమన్నారు. సంక్రాంతి వరకు కార్మికులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రయాణికులకు నాణ్యమైన సేవలు: ఎండీ సజ్జనార్
ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. గతంలో 69 శాతం ఉన్న ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్) మహాలక్ష్మి స్కీమ్ అమలు తర్వాత 88 శాతానికి పెరిగిందన్నారు. కొన్ని డిపోల్లో 100 శాతం వస్తోందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలతో 48 గంటల్లో స్కీమ్ అమలు చేశామంటే అధికారులు, కార్మికులు, డ్రైవర్ల, కండక్టర్ల కృషి ఎంతో ఉందన్నారు. వచ్చే మే నాటికి మరో 1,050 కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.
సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ చాలా గొప్ప సంస్థ అని, సగటు మనిషి జీవితంలో బస్సులు భాగస్వామ్యంగా మారాయన్నారు. జీవితంలో ఒక్కసారైనా ఆర్టీసీ సేవల్ని వినియోగించుకోని వారు ఎవ్వరూ ఉండరన్నారు. ప్రైవేట్ వెహికల్స్, ఆటోలలో ప్రయాణించేందుకు మహిళలు చాలా ఇబ్బంది పడేవారని, ప్రభుత్వం తెచ్చిన ఉచిత ప్రయాణంతో వారికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఈ స్కీమ్ ప్రశాంతంగా అమలయ్యేందుకు పోలీస్ శాఖ నుంచి ఆర్టీసీకి సహకారం ఉంటుందని తెలిపారు.