అంపశయ్య నవీన్, అంతడుపుల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారం

అంపశయ్య నవీన్, అంతడుపుల రమాదేవిలకు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారం

హైదరాబాద్: ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, అంతడుపుల రమాదేవీ పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన సోదరులు అశోక్, రవిచంద్రల తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రతి ఏడాది రచయితలకు, కళాకారులకు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2025 సంవత్సరానికి గానూ సాహిత్యం విభాగంలో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, కళారంగంలో అంతడుపల రమాదేవిలు ఈ అవార్డ్‎కు ఎంపికయ్యారు.

అవార్డుల ఎంపిక కమిటీ కన్వీనర్ డా.పొన్నం రవిచంద్ర సారధ్యంలోని కమిటీ సభ్యులు కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపూడి శ్రీ లక్ష్మీ దీనికి సంబంధించిన పత్రాన్ని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్‎కు  అందజేశారు.   

►ALSO READ | యూరియా కొని ఇళ్లలో నిల్వ పెట్టుకోవద్దు: రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన

పొన్నం సత్తయ్య 15వ వర్ధంతి సందర్భంగా 2025, సెప్టెంబర్13వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.51 వేల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రాన్ని ప్రధానం చేయనున్నారు. గతంలో ఈ అవార్డులను సాహిత్య విభాగంలో నాళేశ్వరం శంకరం, నలిమెల భాస్కర్, చంద్రబోస్, కళాకారుల విభాగంలో ఒగ్గు ధర్మయ్య, విమలక్క, బలగం ఫేమ్ కొమురమ్మ అందుకున్న విషయం తెలిసిందే.