
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అమెరికాలో బాపూ సందేశంపై ప్రచారం చేశారు సినీనటి పూనమ్ కౌర్. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అక్కడి అధికారులను కలిసి గాంధీజీ శాంతి సందేశం ఉన్న ఫొటోలను అందజేశారు. అధికారులతో కలిసి గాంధీజీ 150వ జయంతిని సెలబ్రేట్ చేశారు.
యూఎన్ఓలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గారికి గాంధీజీ చిత్రపటాన్ని శాంతి సందేశంగా అందించారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో భారత రాయబారి సందీప్ చక్రవర్తిని కలిశారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ వ్యవహారాలు చూసే డిప్యూటీ రిప్రజెంటేటివ్ నాగరాజ్ నాయుడుతో పూనంకౌర్ సమావేశమయ్యారు.
మహాత్ముని 150వ జయంతి రోజున ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత ప్రతినిధులతో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉందని పూనమ్ కౌర్ చెప్పారు. “సంప్రదాయ కళలు వర్లీ, కలంకారి, మధుబని పద్ధతుల్లో రూపొందించిన గాంధీజీ చిత్రపటాన్ని సయ్యద్ అక్బరుద్దీన్ కు అందించాను. గాంధీ ఫస్ట్ పెయింటింగ్ ను ఉన్నతాధికారుల సహాయంతో.. ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశాను. గాంధీజీ ఫాలో అయిన శాంతి మార్గమే మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. ఆయన పాటించిన విధానాలు, చెప్పిన సూత్రాలు అందరం పాటిస్తే బాగుంటుంది. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేయడం లేదు. నా వంతు సామాజిక బాధ్యతగా చేస్తున్నాను” అన్నారు పూనమ్ కౌర్.