పేదింటి బిడ్డలు.. గ్రూప్‌‌1 ర్యాంకర్లు

పేదింటి బిడ్డలు.. గ్రూప్‌‌1 ర్యాంకర్లు

రెండు రోజుల కింద విడుదలైన గ్రూప్‌‌ 1 ఫలితాల్లో పలువురు పేదింటి బిడ్డలు సత్తా చాటారు. ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేట్‌‌ కొలువులు చేస్తున్న వారు.. గ్రూప్‌‌ 1 ర్యాంక్‌‌ సాధించి ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. 

పాలవ్యాపారి కూతురు...

రేవల్లి, వెలుగు : పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి కూతురు డీఎస్పీగా ఎంపికైంది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన మండ్ల నాగయ్య, పార్వతమ్మల చిన్న కూతురు మండ్ల కవిత గ్రూప్‌‌ 1లో 48వ ర్యాంక్‌‌ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది. 2014లో నాగర్‌‌కర్నూల్‌‌లో టెన్త్‌‌ చదివిన కవిత బాసర ట్రిపుల్‌‌ ఐటీలో ఎలక్ట్రికల్‌‌ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తర్వాత గ్రూప్‌‌ 1కు ప్రిపేర్‌‌ అయి డీఎస్పీగా ఎంపికైంది

మూడు గ్రూపుల్లో ర్యాంకర్‌‌గా...

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా గంగాపూర్‌‌ గ్రామానికి చెందిన నరిగె స్వామి యాదవ్‌‌ గ్రూప్‌‌ 1 లో 95వ ర్యాంక్‌‌ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. చంద్లాపూర్‌‌లో హైస్కూల్‌‌, బాసర ట్రిపుల్‌‌ ఐటీలో బీటెక్‌‌, హైదరాబాద్‌‌ జేఎన్‌‌టీయూలో ఎంటెక్‌‌ పూర్తి చేసిన స్వామి యాదవ్‌‌ ప్రస్తుతం హైదరాబాద్‌‌లోని తెలంగాణ స్టడీ సెంటర్‌‌లో మెంటార్‌‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల వచ్చిన గ్రూప్‌‌ 2లో 110వ ర్యాంక్‌‌, గ్రూప్‌‌ 3లో 52వ ర్యాంకు సాధించిన స్వామి గ్రూప్‌‌ 1లో 95వ ర్యాంక్‌‌ సాధించాడు. మూడు సార్లు సివిల్‌‌ సర్వీసెస్‌‌ ఇంటర్వ్యూ వరకు వెళ్లిన స్వామి గతేడాది రెండు మార్కుల తేడాతో సివిల్స్‌‌ కోల్పోయాడు. 

జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ నుంచి డీఎస్పీ స్థాయికి...

నిర్మల్, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా భైంసా మండలం వానల్పాడు గ్రామానికి చెందిన కర్రెమొల్ల సంపత్‌‌రెడ్డి గ్రూప్‌‌ 4లో సెలెక్ట్‌‌ అయి ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్‌‌ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్నాడు. ఓ వైపు పనిచేస్తూనే మరో వైపు గ్రూప్‌‌ 1కు ప్రిపేర్‌‌ అయ్యాడు. రెండు రోజుల కింద వెలువడిన ఫలితాల్లో 59వ ర్యాంక్‌‌ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. సివిల్స్‌‌ సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

తహసీల్దార్‌‌గా పనిచేస్తూనే...

హుజూర్‌‌నగర్‌‌, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌‌నగర్‌‌ తహసీల్దార్‌‌గా పనిచేస్తున్న నాగార్జునరెడ్డి గ్రూప్‌‌ 1లో 93వ ర్యాంక్‌‌ సాధించి కమర్షియల్‌‌ ట్యాక్స్‌‌ అసిస్టెంట్‌‌ కమిషనర్‌‌గా ఎంపికయ్యాడు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్‌‌ మండలంలోని బోయగూడెం గ్రామానికి చెందిన నాగార్జునరెడ్డి 2008లో ఎస్జీటీ, 2011లో అసిస్టెంట్‌‌ ట్రైబల్‌‌ వెల్ఫేర్‌‌ ఆఫీసర్‌‌గా, 2012లో గ్రూప్‌‌ 2 ఆఫీసర్‌‌గా ఎంపికయ్యాడు. తల్లి జయమ్మ, భార్య కల్పన ఇచ్చిన ప్రోత్సాహంతోనే గ్రూప్‌‌ 1 కు ఎంపికైనట్లు నాగార్జునరెడ్డి తెలిపారు.

డీఎస్పీగా పంక్చర్‌‌ షాప్‌‌ యజమాని కూతురు

ములుగు/ఏటూరునాగారం : ములుగు జిల్లాలోని జేడీ మల్లంపల్లికి చెందిన అల్లెపు సరోజన సమ్మయ్య దంపతుల కుమార్తె మౌనిక గ్రూప్‌‌1 లో 315వ ర్యాంక్‌‌ సాధించి డీఎస్పీగా ఎంపికైంది. నిరుపేద కుటుంబానికి చెందిన మౌనిక తల్లి సరోజన కూలీ పనులు చేస్తుండగా, తండ్రి సమ్మయ్య పంక్చర్‌‌ షాపు నడిపిస్తున్నాడు. 2020లో డిగ్రీ పూర్తిచేసిన మౌనిక ఎలాంటి కోచింగ్‌‌ తీసుకోకుండానే గ్రూప్‌‌ 1లో ర్యాంక్‌‌ సాధించింది.

సివిల్స్‌‌కు ప్రిపేర్‌‌ అవుతూ...

ములుగు/ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌‌ గ్రూప్‌‌ 1లో 105వ ర్యాంక్‌‌ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు రజిత, సమ్మయ్య చనిపోవడంతో శానిటేషన్‌‌ వర్కర్‌‌గా పనిచేస్తున్న నాయనమ్మ ఎల్లమ్మ వద్ద ఉంటూ చదువు కొనసాగించాడు. జాకారం సోషల్‌‌ వెల్ఫేర్‌‌ గురుకులంలో ఇంటర్‌‌ పూర్తి చేసిన ప్రవీణ్, ఉస్మానియాలో డిగ్రీ, పీజీ కంప్లీట్‌‌ చేశారు. రెండు సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమై.. మూడోసారి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు.