డబుల్​ ఇండ్ల కోసం ట్యాంక్​ ఎక్కి నిరసన

డబుల్​ ఇండ్ల కోసం ట్యాంక్​ ఎక్కి నిరసన

పాలకుర్తి, వెలుగు: జనగామ  జిల్లా దేవరుప్పులలో మంగళవారం డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని పేదలు మిషన్​ భగీరథ వాటర్​ ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపారు. దేవరుప్పులలోని కొత్తవాడలో దళితులకు 20 ఇండ్లను గత ప్రభుత్వం నిర్మించింది. ఆ ఇండ్లు తమకే ఇస్తామని అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పడంతో వాటిలో కొంత మంది ఉంటున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆ ఇండ్లను ఇంకా పంపిణీ చేయలేదని, అనధికారంగా ఉంటున్నారని గ్రామంలో కొంత మంది అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అధికారులు ఇండ్లను ఖాళీ చేయాలని, గ్రామ సభలు ఏర్పాటు  చేసి అర్హులైన వారికి ఇస్తామని, ఈ నెల 9 వరకు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. బుధవారం బాధితులు ఉప్పల నరేశ్​​తన కుటుంబసభ్యులతో కలిసి సమీపంలోని వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఆందోళనకు దిగాడు. ఏడాదిగా ఇండ్లలో ఉంటున్నామని ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వచ్చి హామి ఇస్తేనే దిగుతామని.. లేదంటే దూకుతామని హెచ్చరించారు. తమకే ఇండ్లు ఇస్తామని అప్పటి మంత్రి దయాకర్​రావు హామీ ఇవ్వడంతో రూ. 60 నుంచి 70 వేల వరకు ఇంటి నిర్మాణం కోసం ఖర్చు చేశామని చెప్పారు. ఏడు గంటల పాటు ఈ హైడ్రామా  కొనసాగింది. తహసీల్దార్​ హుస్సేన్,  పాలకుర్తి సీఐ మహేందర్​ రెడ్డి బాధితులకు నచ్చజెప్పి కిందికి రప్పించారు.