
కరీంనగర్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ దఫా వైన్స్ షాపు టెండర్లకు స్పందన కరువైంది. రెండేళ్ల కింద వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే సగానికి తగ్గాయి. మద్యం వ్యాపారంపై ఆసక్తి తగ్గడం, టెండర్ ఫీజు పెంచడంతోపాటు ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్నవారు సిండికేట్ గా మారడం కూడా దరఖాస్తులు తగ్గడానికి కారణమనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఈసారి 2,500కే పరిమితమయ్యాయి. సెప్టెంబర్ 26న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ శనివారం రాత్రితో ముగిసింది. నవంబర్ 23న దుకాణాల లైసెన్స్ లు కేటాయించేందుకు డ్రా తీయసున్నారు. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సులతో మద్యం దుకాణాలు ఓపెన్ కానున్నాయి.
కరీంనగర్ జిల్లాలో మొత్తం 94 షాపులు ఉండగా, వాటిలో కరీంనగర్ అర్బన్ సర్కిల్ లో 21, కరీంనగర్ రూరల్ లో 26, తిమ్మాపూర్ సర్కిల్ లో 14, హుజురాబాద్ సర్కిల్ లో 17, జమ్మికుంట సర్కిల్ లో 16 షాపులు ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు ఈ షాపులకు కోసం సుమారు 2,500 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణ ఇంకా కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో క్రితంసారి 4,040 అప్లికేషన్లు వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 48 వైన్ షాపులు ఉండగా, ఈ దఫా 1,324 అప్లికేషన్లు వచ్చాయి. రెండేండ్ల కింద ఇదే జిల్లాలో 2036 అప్లికేషన్లు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో 74 షాపులకుగాను 1,189 అప్లికేషన్లు వచ్చాయి. క్రితం సారి 2022 అప్లికేషన్లు అందాయి. జగిత్యాల జిల్లాలో 71 షాపులకుగాను 1,750 అప్లికేషన్లు రాగా, క్రితం సారి 2,636 అప్లికేషన్లు అందాయి.