పోర్చుగల్ లో చికిత్స అందక.. భారతీయురాలి మృతి

పోర్చుగల్ లో చికిత్స అందక.. భారతీయురాలి మృతి

భారత్ కు చెందిన ఓ గర్భిణి (34) సకాలంలో చికిత్స అందక పోర్చుగల్ లో గుండెపోటుతో మృతిచెందింది.ఈ ఘటన చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మార్తా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు.  తొలుత ఆమెను  రాజధాని లిస్బన్ లోని ప్రధాన ఆస్పత్రి ‘శాంటియా మారియా’లో ఉన్న నియో నటాలజీ విభాగం దగ్గరికి తీసుకెళ్లారు. అయితే పడకలన్నీ ఫుల్ అయ్యాయని చెప్పి.. ఆమెను అడ్మిట్ చేసుకోలేదు.  అక్కడి నుంచి అంబులెన్స్ లో నగరంలోని ఇతరత్రా ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఆ గర్భిణి గుండె ఆగి తుదిశ్వాస విడిచింది. వెంటనే అత్యవసర సిజేరియన్ చికిత్స అందించి.. ఆమె శిశువును మాత్రం ప్రాణాలతో కాపాడారు.

ఈ ఘటనపై మీడియాలో హాట్ డిబేట్ జరగడంతో .. పోర్చుగల్ ఆరోగ్యమంత్రి టెమిడో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదొక్కటే ఘటన కాదు.. గత కొన్ని నెలల్లో ఇద్దరు పిల్లలు కూడా ఇలాగే ఆస్పత్రుల్లో చేర్చుకోవడం ఆలస్యమై చనిపోయారు.  కాగా, ఆరోగ్యశాఖ మంత్రి టెమిడో రాజీనామాను ఆమోదించినట్లు ప్రధానమంత్రి యాంటోనియో కోస్టా వెల్లడించారు. దేశంలో వైద్యపరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెడతామని తెలిపారు.  కాగా, 2018 సంవత్సరం నుంచి పోర్చుగల్ ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో టెమిడో  వ్యవహరించారు.