అయితే పదవి.. లేదంటే ప్యాకేజీ! సాగర్‌లో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్..

అయితే పదవి.. లేదంటే ప్యాకేజీ! సాగర్‌లో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్..
  • నాగార్జునసాగర్‌లో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్
  • జానా అనుచరులపై గురిపెట్టిన గులాబీ లీడర్లు
  • తమ లీడర్లతో బేరసారాలు సాగిస్తున్నారన్న కాంగ్రెస్
  • బీజేపీ లీడర్లకు భారీ ఆఫర్లు.. అలెర్టయిన కమల దళం
  • సాగర్​ బరిలో 60 మంది

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఎట్లైనా గెలవాలని భావిస్తున్న టీఆర్ఎస్.. ఇందుకోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే ప్రతి మండలానికి ఓ ఎమ్మెల్యేను ఇన్​చార్జిగా పెట్టి ప్రచారం చేయిస్తున్న పార్టీ హైకమాండ్ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్​కు తెరతీసింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ స్థాయి లీడర్లను పదవుల హామీలు, ప్యాకేజీలతో తమ వైపు తిప్పుకుంటోంది. దీంతో రెండు, మూడు రోజులుగా సాగర్ నియోజకవర్గం పరిధిలో టీఆర్​ఎస్​లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ఎన్నికల్లో పనిచేసే క్యాడర్​ లేకుండా చేయాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు ఆ పార్టీ లీడర్లు బహిరంగంగానే అంటున్నారు. కొన్నిచోట్ల బెదిరింపులకూ పాల్పడుతున్నారనే వార్తలువస్తున్నాయి.

లీడర్​స్థాయిని బట్టి హామీలు, ప్యాకేజీలు
గ్రామ, మండల స్థాయిలో కొంత ఓటు బ్యాంకు కలిగిన చోటామోటా లీడర్లతో పాటు వివిధ కుల సంఘాలకు చెందిన ప్ర తినిధులను టీఆర్​ఎస్​లీడర్లు తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇందుకోసం బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా లీడర్లపై పాత కేసులుంటే బెదిరించడం, లేదంటే టీఆర్​ఎస్​లో మంచి పదవులు ఇస్తామని, ప్యాకేజీ ఇస్తామని దారికి తెచ్చుకుంటున్నారు. సర్పంచులు, ఎంపీటీసీ స్థాయి లీడర్లకు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు. ‘మాట్లాడుకోవడం, పైసలు తీస్కోవడం, కండువా కప్పుకోవడం’ అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఓ ప్రతిపక్ష పార్టీ నేత ‘వెలుగు’తో చెప్పారు.  తమ మండలంలోని కొందరు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు రూ.25 వేలకు కూడా పార్టీ మారుతున్నారని ఆయన వాపోయారు. 
 

జానా అనుచరులే టార్గెట్
కాంగ్రెస్ నుంచే తమకు బలమైన పోటీ ఉందని భావిస్తున్న టీఆర్​ఎస్ లీడర్లు, ఆ పార్టీ క్యాడర్​పై గురిపెట్టారు. అందులోనూ జానాకు మొదటి నుంచీ అండగా ఉంటున్న అనుచరులను ఒక్కొక్కరిగా తమవైపు తిప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెద్దవూర, గుర్రంపోడు, హాలియా, నిడమనూరు, త్రిపురారం, మాడ్గుల పల్లి మండలాల్లో కాంగ్రెస్​కు చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, సెకండ్ క్యాడర్ లీడర్లు టీఆర్ఎస్​లోకి జంప్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన కాంగ్రెస్​ జనగర్జన సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ తమ లీడర్లను, క్యాడర్​ను టీఆర్ఎస్ లీడర్లు ప్రలోభాలకు గురిచేస్తున్నార ని, అర్ధరాత్రి కాంగ్రెస్ లీడర్ల ఇళ్లలో చొరబడి బేరసారాలు సాగిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ క్యాడర్ పై కాసుల వల 
సాగర్ టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ లీడర్లుకు సైతం టీఆర్​ఎస్ హై కమాండ్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఓ టీఆర్​ఎస్ ఎమ్మె   ల్యే, మరో ముఖ్యనేత భారీ మొత్తం ముట్టజెప్తామని ఆఫర్ మాట్లాడి నట్టు తెలిసింది. అలాగే మరి కొంత మంది బీజేపీ లీడర్లకు, క్యాడర్​కు కాసుల వల వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన బీజేపీ నాయకత్వం టీఆర్​ఎస్ ఎత్తులు తిప్పికొట్టే వ్యూహాలు అమలు చేస్తోంది.