
అహ్మదాబాద్: గుజరాత్ లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గురువారం ఒక్కరోజులోనే 92 కరోనా పాజిటివ్ కేసులు ఫైల్ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,021కి చేరుకుందని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కరోనా ట్రీట్మెంట్ పొందుతూ ఇద్దరు పేషెంట్లు చనిపోయారని, దీంతో మరణించినవారి సంఖ్య 38 కి చేరుకుందని తెలిపారు. వడోదరలో 31 ఏండ్ల వ్యక్తి, 55 ఏండ్ల మరొక వ్యక్తి అహ్మదాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారని చెప్పారు. ఇప్పటివరకు 74 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఏప్రిల్ 21 వరకు అహ్మదాబాద్ సిటీలో కర్ఫ్యూ విధించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 1,021 కేసుల్లో అత్యధికంగా అహ్మదాబాద్ (590), వడోదర (137), సూరత్ (102), రాజ్‌కోట్ (28), భావ్‌నగర్ (26) చొప్పున ఐదు జిల్లాల్లో నమోదయ్యాయి.