15 రోజుల్లో సగానికి పైగా పడిపోయిన ఆలు ధర

15 రోజుల్లో సగానికి పైగా పడిపోయిన ఆలు ధర

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: రోజురోజుకు ఆలూ రేటు పడిపోతుండడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. తక్కువ నీటి వనరులతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్న ఆశతో ఆలుగడ్డ సాగు చేసిన  రైతులు ఇప్పుడు కనీసం పెట్టుబడులైనా దక్కుతాయా అని ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 20 వేల ఎకరాల్లో ఆలుగడ్డ పంటను సాగు చేస్తుంటారు. ప్రస్తుత సీజన్ లో సాధారణ దిగుబడుల కు తోడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి  ఆలుగడ్డ భారీగా దిగుమతి అవుతుండటం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 15 రోజుల క్రితం పది కిలోల బస్తా రూ. 300 వరకు పలుకగా ఇప్పుడది రూ. 130కి  పడిపోయింది. జిల్లా రైతులు పండించిన పంటను కొంత స్థానికంగా అమ్ముకుంటున్నా అత్యధికులు హైదరాబాద్ బోయినిపల్లి, వంటిమామిడి మార్కెట్లకు  తరలిస్తారు. దిగుబడులు బాగుంటాయని నాణ్యమైన విత్తనాన్ని ఆగ్రా,  జలంధర్ నుంచి తెచ్చి నాటారు. వాతావరణం అనుకూలించకపోవటం, చీడపీడల  కారణంగా ఆలు దిగుబడి పడిపోయింది. ఎకరం విస్తీర్ణానికి కనీసం రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి రావాలి కాని ప్రస్తుతం క్వింటాల్ లోపే వస్తోంది. పండిన పంటకు ధర దక్కుతుందేమోనని బోయినపల్లి మార్కెట్ కు తరలించారు. అయితే నార్త్ ఇండియా నుంచి పెద్దఎత్తున ఆలుగడ్డలు దిగుమతి  కావడంతో ధర పడిపోయింది. దీంతో కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని  ఆందోళన చెందుతున్నారు. 

దిగుమతుల నియంత్రణకు డిమాండ్

డిసెంబరు మూడో  వారం నుంచి  స్థానికంగా పండించిన ఆలుగడ్డ మార్కెట్​కు రావటం మొదలైంది. ఈ సమయంలో మార్కెట్​లో కిలో ధర రూ. 20 పైగా పలికింది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా ఆలుగడ్డ దిగుమతి కావడం ప్రారంభమైంది. హైదరాబాద్​కు  ప్రతీరోజు ఇతర రాష్ట్రాల నుంచి ఐదు వేల బస్తాల ఆలు  దిగుమతి అవుతోంది. స్థానిక రైతులు పండించిన పంట జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ధరలు తగ్గడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానిక రైతులు పండించిన ఆలుగడ్డ మార్కెట్లోకి వస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాల సరుకు దిగుమతి కాకుండా నియంత్రించాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్​సిద్దిపేట జిల్లా వంటిమామిడి మార్కెట్ ను సందర్శించిన సమయంలో ఆలు ధరలు పడిపోతున్న  విషయాన్ని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక దిగుబడి వచ్చే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి  దిగుమతులను ఆపాలని కోరారు.  రైతుల విన్నపాన్ని మన్నించి కొన్నిరోజుల పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతిని ఆపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అప్పట్లో కొంత మేలు జరిగినా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతిని ఆపితే స్థానిక రైతులకు  కొంతమేర లబ్ధి చేకూరుతుంది.