యాదగిరిగుట్ట రోడ్లపై గుంతలు..బస్సులో భక్తుల లొల్లి

యాదగిరిగుట్ట రోడ్లపై గుంతలు..బస్సులో భక్తుల లొల్లి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట పైకి వెళ్లేందుకు వేసిన రోడ్లపై ఏర్పడిన గుంతలు భక్తులు కొట్టుకోవడానికి కారణమయ్యాయి. చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తున్నా జరిగిందిదే. గుట్ట కింది నుంచి భక్తులు పైకి వెళ్లేందుకు ఈ మధ్య దేవస్థానం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడిపిస్తున్నారు. అది కిక్కిరిసిపోవడం, రోడ్లపై గుంతలతో కుదుపులకు గురికావడంతో ఓ యువకుడు అమ్మాయికి తాకాడు. ఇది కాస్తా గొడవకు దారి తీసింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్, సికింద్రాబాద్ కు చెందిన రెండు వేర్వేరు ఫ్యామిలీలు లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం శుక్రవారం యాదగిరిగుట్టకు వచ్చారు. కొండ కింద కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించుకున్న తర్వాత కొండపైకి చేరుకోవడానికి దేవస్థానం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు ఎక్కారు. అప్పటికే బస్సు భక్తులతో కిక్కిరిసిపోయింది.

కెపాసిటీకి మించి భక్తులను ఎక్కించుకొని కొండపైకి వెళ్తున్న బస్సు.. ఓ చోట రోడ్డుపై గుంతలతో కుదుపునకు గురైంది. దీంతో బస్సులో ఉన్న ఓ యువకుడు పక్కనే ఉన్న అమ్మాయికి తగిలాడు. ఎందుకు తగిలావని అమ్మాయి ప్రశ్నించగా..బస్సు కుదుపు వల్ల జరిగిందని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి తండ్రి కోపంతో బస్సులోనే ఆ యువకుడిపై చేయి చేసుకున్నాడు. ఈలోపు బస్సు కొండపైకి చేరుకుంది. తనను అనవసరంగా కొట్టాడని సదరు యువకుడితో పాటు అతడి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు కొండపైన బస్టాండ్ లో బస్సు దిగగానే అమ్మాయి తండ్రిపై దాడి చేశారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇది చూసిన ఎస్పీఎఫ్ పోలీసులు, అక్కడే ఉన్న మరికొంత మంది భక్తులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ గొడవలో ఇరువర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి.