కుండీల్లో పెంచే మొక్కలకు స్పెషల్‌‌ కేర్‌‌‌‌ అవసరం

కుండీల్లో పెంచే మొక్కలకు స్పెషల్‌‌ కేర్‌‌‌‌ అవసరం

వర్షాకాలం స్టార్ట్‌‌ అయింది. మొక్కలు పెట్టడానికి అనువుగా ఉంటుందని ఈ కాలంలోనే గార్డెనింగ్‌‌, ఇండోర్ ప్లాంటింగ్‌‌ మొదలుపెడుతుంటారు చాలామంది.  అయితే మొక్క నాటి, అవే పెరుగుతాయిలే అని వదిలేయకుండా వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా కుండీల్లో పెంచే మొక్కలకు స్పెషల్‌‌ కేర్‌‌‌‌ కావాలి. కుండీల్లో ఉంచే మొక్కలకు వర్షాకాలంలో కూడా ఎక్కువెక్కువ నీళ్లు పడుతుంటారు చాలామంది. అలా చేస్తే మట్టిలో ఉన్న సారమంతాపోయి, మొక్క తొందరగా చనిపోతుంది. అందుకని అవసరమైనప్పుడు మాత్రమే నీళ్లు పట్టాలి. మరీ వేడివి, చల్లని నీళ్లు పడితే వేర్లు దెబ్బతింటాయి. అందుకే మొక్కకి రూమ్‌‌ టెంపరేచర్‌‌‌‌లో ఉన్న నీళ్లు  పట్టాలి.

నీళ్లు ఎక్కువ పడితే అవి కుండీ అంచున నిల్వ ఉంటాయి. దాంతో తెగులు, ఫంగస్‌‌, బ్యాక్టీరియా చేరి మొక్క పాడైపోతుంది. అందుకని కుండీల్లో నీళ్లు బయటకు సరిగాపోయే ఏర్పాటు ఉండాలి. వర్షాకాలంలో కొత్తకొత్త పురుగులు పుట్టుకొస్తాయి. మీలీబగ్‌‌ వల్ల ఆకులు ముడుచుకుపోవడం, రోజ్‌‌ బ్లాక్‌‌ స్పాట్‌‌ ఫంగస్‌‌ వల్ల రంధ్రాలు పడటం, రైస్‌‌ బ్లస్ట్‌‌ ఫంగస్‌‌ వల్ల కుళ్లిపోతాయి మొక్కలు. మొక్కలు పూర్తిగా పాడుకాకుండా ఉండాలంటే... ఇన్ఫెక్షన్‌‌ సోకిన ఆకులను గమనించి వెంటనే తుంచేయాలి. లేదా పెరిగిన కొమ్మలు, ఆకులను కత్తిరించి మొక్కకు ఎరువులు వేస్తుండాలి. 

కిరణజన్య సంయోగక్రియ జరిగి మొక్కలు ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. అందుకని మొక్కలకు సరైన వెలుతురు తగిలే చోట పెట్టాలి. నీళ్లు పట్టడం వల్ల మట్టి గట్టిగా తయారవుతుంది. అందుకని వారానికి ఒకసారైనా కుండీలో లేదా మొక్క పెట్టిన మట్టిని గుల్ల గుల్లగా చేయాలి. అలా చేయడం వల్ల మట్టి స్పాంజ్‌‌లా అయి నీళ్లు వేర్ల వరకు చేరుతాయి.