నిరసనల పునాదులపై కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది : వి.సంధ్య

నిరసనల పునాదులపై కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది : వి.సంధ్య

హైదరాబాద్, వెలుగు :  తొమ్మిదిన్నరేండ్ల  దొర పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో పెళ్లుబికిన నిరసనల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అన్నారు. ఆదివారం సైఫాబాద్‌లోని సామ్రాట్ కాంప్లెక్స్‌లో ‘కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ప్రజా సంఘాల నిగాహ్’ పేరుతో ప్రజాతంత్ర ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు ఉన్నారన్న విషయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. 

మహిళల సమస్యల పరిష్కారం కోసం పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో వేసిన కమిటీ సిఫార్సులు ఏమయ్యాయో తెలియదన్నారు. మహిళల సమస్యలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పడానికి గడిచిన వంద రోజ్లుల్లో ప్రయత్నించామని, ఎన్నికల ఉన్నాయని తమకు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదన్నారు. 

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉచిత విద్య, వైద్యం, నివాసం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రణాళికను రూపొందించుకుందామన్నారు. ఎడిటర్లు ఎన్. వేణుగోపాల్, కె.శ్రీనివాస్, కన్నెగంటి రవి, ప్రొఫెసర్ రమా మేల్కొటే, దేవులపల్లి అజయ్, కె.సుజయ, ఆర్.వెంకటరెడ్డి, దళిత ఉమెన్స్ ఉద్యమ నాయకురాలు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఖలీదా ఫర్వీన్, మహిళా, ట్రాన్స్‌జెండర్  సంఘాల జేఏసీ నుంచి ముద్రబోయిన రచన పాల్గొన్నారు.