
విద్యుత్ శాఖపై సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండలు మండుతుండటంతో పవర్ డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. నిన్న ఉదయం విద్యుత్ డిమాండ్ 10 వేల 75 మెగావాట్లకు చేరింది. విద్యుత్ వినియోగం మరింత పెరగవచ్చన్న అంచనాలతో అధికారులను అప్రమత్తం చేశారు ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై నిరంతరం సమీక్షించుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. రెండు రోజులుగా విద్యుత్ డిమాండ్ పెరగడంతో అప్రమత్తమైంది ట్రాన్స్ కో. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ట్రాన్స్ కో సీఎండి ప్రభాకర్ రావు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై విద్యుత్ సౌధలో అధికారులతో సమీక్షించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు.
సాగుకు కరెంట్ వాడకం పెరగడం, ఎండల తీవ్రతతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయింది. నిన్న 10 వేల 505 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. ఎండలు పెరిగితే విద్యుత్ వినియోగం మరింత పెరగవచ్చనే అంచనాలున్నాయి. రాబోయ్యే రోజుల్లో 11వేల మెగావాట్ల వరకు విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. 2016-17లో సగటున ప్రతిరోజు 164 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది. 2017-18లో 179 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ సంవత్సరం సగటున నవంబర్ నాటికి 189 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. కానీ ఎండాకాలం ప్రారంభమయిన తర్వాత వినియోగం 200 మిలియన్ యూనిట్లు దాటుతోంది. సోమవారం గరిష్టంగా 219 మిలియన్ యూనిట్ల వాడకం జరిగింది. రాష్ట్రంలోని ప్లాంట్లలో గరిష్టంగా విద్యుత్ ఉత్పత్తి జరపడంతో పాటు, ఇతర మార్గాల ద్వారా కూడా అవసరమైనంత విద్యుత్ ను సమకూర్చుకోవాలని సిఎండి ప్రభాకర్ రావు సూచించారు. ప్లాంట్ల వారీగా విద్యుత్ ఉత్పత్తిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, డిస్కమ్ ల వారీగా విద్యుత్ డిమాండ్ ను అంచనా వేసి తగిన వ్యూహంతో ముందుకుపోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.