- 1.63 కోట్ల సర్‌చార్జీ చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసిన అధికారులు
- పాస్‌లు ఇవ్వనందుకే కట్ చేశారన్న హెచ్‌సీఏ
- ఫిబ్రవరిలోనే నోటీసులు ఇచ్చామన్న ఆఫీసర్లు
- ఇవ్వాల్టి మ్యాచ్ నేపథ్యంలో ఒక్కరోజు మినహాయింపు ఇస్తున్నట్టు అధికారుల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. కరెంటు బిల్లు కట్టలేదని ఉప్పల్ స్టేడియంకు కరెంట్ సప్లైని నిలిపివేసింది. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో గత ఫిబ్రవరి 20న విద్యుత్ అధికారులు హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ హెచ్‌సీఏ స్పందించక పోవడంతో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేశామని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. విషయం పెద్దది కావొద్దనే ఉద్దేశంతోనే మార్చి 27న జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కి ముందు విద్యుత్ సరఫరా బంద్ చేయలేదని కరెంటు డిపార్ట్‌మెంట్ తెలిపింది.
ముందే హెచ్చరించినా హెచ్‌సీఏ అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో విద్యుత్ శాఖ తీవ్ర చర్యలు చేపట్టింది. అయితే, శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఒక్కరోజు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు విద్యుత్శాఖఅధికారులు గురువారం రాత్రి స్టేడియంకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. క్రికెట్అభిమానులు నిరుత్సాహపడొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
సర్ చార్జీ మినహాయింపునకు డిస్కం నో..
ఉప్పల్ స్టేడియం మొత్తం రూ.3 కోట్ల 5 లక్షల కరెంట్బిల్లు బకాయిపడింది. ఇందులో కరెంట్ బిల్లు రూ.1.41 కోట్లు, పెండింగ్ సర్ చార్జీ రూ.1.63 కోట్లు ఉండగా ఈ వివాదం కోర్టుకు చేరింది. అయితే, బిల్లు మొత్తంలో 50% వెంటనే చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు హెచ్‌సీఏ మూడు దఫాలుగా చెల్లింపులు చేపట్టింది.
మొదటి ఇన్‌స్టాల్ మెంట్ లో రూ.70.59 లక్షలు, రెండో ఇన్‌స్టాల్ మెంట్ లో రూ.35.29లక్షలు, మూడో ఇన్‌స్టాల్ మెంట్ లో రూ.35.29 లక్షల చొప్పున రూ.1.41కోట్లు చెల్లించింది. కాగా, సర్ చార్జీని మినహాయించాలని హెచ్‌సీఏ అభ్యర్థించగా.. డిస్కం తిరస్కరించి రూ.1.63 కోట్లు చెల్లించాల్సిందేనని నోటీసు జారీ చేసింది. దీనిపై హెచ్‌సీఏ స్పందించకపోవడంతో గురువారం కరెంట్ కట్ చేసింది.
అయితే, బకాయిలు రాబట్టు కోవడం కోసమే తప్పని పరిస్థితుల్లో విద్యుత్ ను నిలిపివేసినట్లు విద్యుత్‌శాఖ అధికారులు వెల్లడిస్తుండగా.. క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన పాస్‌లు ఇవ్వనందుకే విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేసినట్లు హెచ్‌సీఏ ఆరోపిస్తున్నది.